Transfer Trimurthulu Review : ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే..?
ఒకప్పటి మంచి హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అని ప్రకటించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. (Transfer Trimurthulu Review)
- Saketh U
- Published on- June 19, 2026 / 04:07 PM IST
Transfer Trimurthulu Review
Transfer Trimurthulu Review : వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ తెరక్కించిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ నిర్మాణంలో కమల్ తేజ నార్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాశీ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా శిల్ప తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా నేడు జూన్ 19న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
2005లో అరకు దగ్గర్లోని ఓ పోలీస్ స్టేషన్ కి రాత్రి పూట ప్రియమ్మ వచ్చి నన్ను సంతోష్ బాబు(వివేక్ రఘువంశీ) రేప్ చేసాడు అని చెప్పడంతో కానిస్టేబుల్ శ్రీనివాసులు(దేవి ప్రసాద్) కంప్లైంట్ రాసుకుంటాడు. కానీ SI వచ్చి ఆ అమ్మాయిని వేశ్య అని FIR రాసి సంతోష్ దగ్గరికి పంపించమంటాడు. ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోగా శ్రీనివాసులు అమ్మాయిని కాపాడలేకపోయానని బాధతో చనిపోతాడు.
20 ఏళ్ళ తర్వాత నిజాయితీగా పనిచేసి ఎక్కువగా ట్రాన్స్‌ఫర్స్ తెచ్చుకుంటాడు కానిస్టేబుల్ త్రిమూర్తులు(వడ్డే నవీన్). అమలాపురంలో సీఎం కమలాదేవి(శిల్ప తులస్కర్) మీటింగ్ పెట్టి తనపై అటాక్ తనే ప్లాన్ చేసుకోని రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి కొడుకు సంతోష్ బాబుని సీఎం చేయాలని అనుకుంటుంది. కానీ త్రిమూర్తులు నిజంగా డ్యూటీ చేసి ఆమె ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. దీంతో అతన్ని ట్రాన్స్‌ఫర్ చేసి అరకుకి పంపిస్తారు. అక్కడ దగ్గర్లో ఉన్న ఓ పాత పోలీస్ స్టేషన్ కి ఒక్కడినే వెళ్లి కాపలా ఉండమనటంతో అది తన తండ్రి పనిచేసిన పోలీస్ స్టేషన్ అని సంతోషిస్తాడు.
ఖాళీగా ఉండి అక్కడ రికార్డ్ రూమ్ లో పాత ఫైల్స్ తిరగేస్తుంటే ప్రియమ్మని రేప్ చేసారు అని తన తండ్రి చివరగా రాసిన కంప్లైంట్ తో పాటు ప్రియమ్మ వేశ్య అని ఫేక్ FIR దొరుకుతాయి. దాంతో ఆ కేసుని బయటకు తీసి సీఎం కొడుకు సంతోష్ బాబుకి శిక్ష పడేలా చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటాడు త్రిమూర్తులు. మరి 20 ఏళ్ళ క్రితం రాసిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు కేసు నడుస్తుందా? దానికి ప్రూఫ్స్ ఉంటాయా? అసలు ఆ అమ్మాయి ఏమైంది? సంతోష్ బాబుకు శిక్ష పడుతుందా? అసలు 20 ఏళ్ళ క్రితం జరిగింది ఏంటి? ఈ క్రమంలో త్రిమూర్తులు ఎదుర్కున్న కష్టాలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Maa Inti Bangaram Review : ‘మా ఇంటి బంగారం’ రివ్యూ.. అయ్య బాబోయ్ సమంత యాక్షన్ అదరగొట్టిందిగా..
సినిమా విశ్లేషణ..
ఒకప్పటి మంచి హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అని ప్రకటించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ అంతా 20 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన, మళ్ళీ గెలవడానికి సీఎం కమలాదేవి ప్లాన్స్, త్రిమూర్తులు నిజాయితీ, అతని ట్రాన్స్‌ఫర్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆ పాత కంప్లైంట్ బయటపడటంతో నెక్స్ట్ త్రిమూర్తులు ఏం చేస్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం త్రిమూర్తులు ఆ కేసు గురించి తిరగడం, సంతోష్ బాబు, కమలాదేవి ఏం చేసారు అని నడిపించారు.
ఫస్ట్ హాఫ్ ఒక అరగంట సాగుతుంది. సీఎం పై అటాక్ ప్లాన్ చేస్తే త్రిమూర్తులు దాన్ని చెడగొట్టే యాక్షన్ సీన్ బాగుంటుంది. తండ్రి రాసిన కంప్లైట్, ఫేక్ FIR లు దొరకడంతో ఇంటర్వెల్ నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ లో రెండు సాంగ్స్ అక్కర్లేకపోయినా పెట్టారు. సెకండ్ హాఫ్ లో సీరియస్ గా కథ నడుస్తుంటే మధ్యలో అక్కర్లేని ఐటెం సాంగ్ పెట్టారు. కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. కానీ గతంలోనే ఇలాంటి కథలు, కథనాలు చాలానే వచ్చాయి.
క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ ఊహించలేరు. పాటలు, ఫైట్స్, హీరోయిన్ సీన్స్ తో సినిమాని పక్కా పాతకాలం కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఇదే కథని మూడు అక్కర్లేని పాటలు తీసేసి, ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ కట్ చేస్తే ఆసక్తికర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా మారేది. చివర్లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్..
వడ్డే నవీన్ రీ ఎంట్రీలో తన పర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించారు. యాక్షన్ సీన్స్ లో బాగానే కష్టపడ్డారు. గ్యాప్ వచ్చినా డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా మెప్పించారు. రాశి సింగ్ కానిస్టేబుల్ భార్య పాత్రలో అక్కడక్కడా వచ్చి క్యూట్ గా కనిపించి వెళ్ళిపోతుంది. నెగిటివ్ షేడ్స్ లో శిల్ప తులస్కర్, వివేక్ రఘువంశీ చాలా బాగా నటించారు. దేవి ప్రసాద్ తండ్రి, పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కాసేపే కనిపించి మెప్పించారు. రఘుబాబు నవ్వించే ప్రయత్నం చేసారు. వడ్లమాని శ్రీనివాస్, బాబా భాస్కర్, గాయత్రి భార్గవి, జ్వాలా కోటి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బానే నటించారు.
Also Read : Vanda Devullu Review : ‘వంద దేవుళ్ళు’ మూవీ రివ్యూ.. తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్న కొడుకులు..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు అంతగా వర్కౌట్ అవ్వలేదు. 20 ఏళ్ళ క్రితం కేసు అనే పాయింట్ తో ఓ కానిస్టేబుల్ చుట్టూ కమర్షియల్ కథ రాసుకొని బాగానే తెరకెక్కించారు కొత్త దర్శకుడు. ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా మాత్రం బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఓ కానిస్టేబుల్ 20 ఏళ్ళ క్రితం కేసుని బయటకు తీసి ఎదుర్కున్న సంఘటనలు ఏంటి అని కమర్షియల్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
