నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు ఇకలేరు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందారు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి. ఆమె కొద్దికాలం క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.
1932, ఫిబ్రవరి 11న రావి కొండలరావు సామర్లకోటలో జన్మించారు. నాటకరంగం కోసం రావి కొండలరావు ఎంతగానో కృషి చేశారు. రావి కొండలరావు నాటకరంగ పరిస్థితిని గమనిస్తూ.. దానిని నిలబెట్టేందుకు పట్టువదలని విక్రమారుడిలా ప్రయత్నాలు చేశారు. నాటక రంగానికి ఆయన తన భార్య రాధాకుమారితో కలిసి చేసిన సేవ వెలకట్టలేనిది. 1958లో ‘శోభ’ చిత్రంతో రావి కొండల రావు సినీ ప్రస్థానం మొదలైంది. అంతకుముందు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేశారు.
నటుడిగా ‘తేనె మనసులు, దసరా బుల్లోడు, రంగూన్ రౌడి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, చంటబ్బాయ్, మంత్రిగారి వియ్యంకుడు, నిన్నే ఇష్టపడ్డాను, రాధాగోపాళం, కింగ్, మీ శ్రేయోభిలాషి, ఓయ్, వరుడు’ వంటి ఎన్నో చిత్రాలలో నటించారు. దాదాపు ఆయన 600కు పైగా చిత్రాలలో నటించారు. నాటకరంగం, నటుడు అనే కాకుండా రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు.
‘భైరవద్వీపం, బృందావనం, పెళ్లిపుస్తకం, చల్లని నీడ’ వంటి చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. నిర్మాతగానూ కొన్ని చిత్రాలకు ఆయన వ్యవహరించారు. సినిమా రచనలే కాకుండా ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో ఆయన రచనలు చేశారు. హాస్యరచయితగా గుర్తింపు పొందారు. సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశారు.
బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం అందుకున్న రావి కొండలరావు మరెన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి ఆయనను గౌరవించింది. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు, అలాగే నాటకరంగానికి తీరనిలోటు. ఆయన మరణవార్త విన్న చిత్ర ప్రముఖులు, నాటక రంగ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.