మెగాస్టార్ చిరంజీవికి తప్పిన ప్రమాదం

  • Publish Date - August 31, 2019 / 01:40 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్‌ వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్‌… ముంబై ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. టేకాఫ్ అయిన అరగంటకే విస్తారా విమానం ల్యాండింగ్‌ అయ్యింది. ఆ సమయంలో ప్లైట్‌లో మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నారు.  

ఇందులో చిరంజీవి కూడా ఉన్నారు. చిరంజీవి ఫోటోను  ఓ ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. ఎమర్జెన్సీగా ల్యాండ్ అవడంతో ప్రయాణీకులందరూ ఎయిర్ పోర్టులో పడిగాపులు కాశారు. మరో విమానం ఏర్పాటు చేసి..వారిని హైదరాబాద్‌కు పంపించారు. 

చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్‌లో హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తుండడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 02న గాంధీ జయంతి సందర్భంగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదలవనుంది.