Roja
YSRCP: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా షాట్-4ను ఏపీ మంత్రి రోజా రిలీజ్ చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న రోజా మాట్లాడుతూ… ఈ సినిమా వ్యూహకర్త ఆర్జీవీకి అభినందనలు తెలుపుతున్నానన్నారు.
బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ వర్మ అని చెప్పారు. వ్యూహం టైటిల్ ప్రకటించగానే టీడీపీ వణికిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడి కుట్రలకు, జగన్ కి మధ్య జరిగిన సంఘర్షణే వ్యూహం సినిమా అని చెప్పారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వ్యూహాన్ని 29వ తేదీన చూడబోతున్నామన్నారు. దొంగ పేర్లతో కొందరు శ్యామ్ బాబు క్యారెక్టర్ పెట్టి సినిమాలు తీయడం కాదని, ఇలా నిజ జీవితంలో ఉన్న అసలు పేర్లతో సినిమా తీసిన దమ్ముండాలని అన్నారు.
మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ… జగన్ జీవిత చరిత్రను ఆర్జీవీ సినిమాగా తీసే ప్రయత్నం చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ వణికిపోతున్నారంటూ విమర్శలు గుప్పించారు. సినిమాకు ఎవరు అడ్డుపడినా 29న విడుదలై ఘనవిజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… వ్యూహంలో కథ కంటే క్యారెక్టర్ల పొలిటికల్ సైకాలజీని ఆవిష్కరించానని తెలిపారు. లోకేశ్ వ్యూహం సినిమాను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ… జగన్ ఎప్పటికీ సీఎంగానే ఉంటారని అన్నారు. జగన్ నిజ జీవిత ఆధారంగా సినిమాను తెరకెక్కించే అవకాశం దక్కడం తన అదృష్టమని చెప్పారు.