ఆ రెండు కథలతో పాటు.. బాబు, వై.ఎస్.ఆర్ కథలూ నావే.. కాపీ కొట్టారు.. కోర్టుకెక్కుతా..

  • Publish Date - August 11, 2020 / 06:27 PM IST

యన్.టి.ఆర్ బయోపిక్ సినిమా గురించి దర్శకుడు దేవా కట్టా, నిర్మాత విష్ణు ఇందూరి మధ్య ట్విట్టర్ వేదికగా వివాదం కొనసాగుతోంది. సోమవారం రాత్రి (ఆగస్టు 10) దేవా కట్టా చేసిన ట్వీట్‌తో వీరి మధ్య వివాదం నెలకొన్న వెలుగులోకి వచ్చింది.

‘‘ప్రారంభంలో నేను రాసిన ఓ క‌థ‌ను దొంగ‌లించి సినిమా చేసిన ఓ వ్య‌క్తి.. దాంతో డిజాస్ట‌ర్‌ను చ‌విచూశాడు. కానీ ఈసారి నేను అలా కానివ్వ‌ను. 2017లో చంద్ర‌బాబు నాయుడుగారు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి పొలిటిక‌ల్ జీవితాల‌ను ఆధారంగా చేసుకుని వారి మ‌ధ్య స్నేహం, రాజకీయ వైరం అనే అంశాల‌తో ఫిక్ష‌నల్‌గా ఓ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాను. ఆ క‌థ‌ను రిజిష్ట‌ర్ కూడా చేయించాను.
నేను ఈ స్క్రిప్ట్‌ను హాలీవుడ్ మూవీ ‘గాడ్‌ఫాద‌ర్’ సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని మూడు భాగాలుగా కథ రాసుకున్నాను. మా లీగ‌ల్ టీమ్ ఈ వ్య‌వ‌హ‌రాన్ని గ‌మ‌నిస్తున్నారు’’ అంటూ విష్ణు ఇందూరిపై ఆరోపణలు చేశారు దేవా కట్టా.


దేవా కట్టా ఆరోపణలపై నిర్మాత విష్ణు ఇందూరి స్పందిస్తూ.. ‘‘గ‌తంలో బాలీవుడ్ సినిమా ‘రాజ్‌నీతి’ తెలుగు రీమేక్ కోసం దేవా క‌ట్టాను కలిశాను. అప్పుడు య‌న్.టి.ఆర్ బ‌యోపిక్ క‌థ‌ను, స్క్రీన్‌ప్లేతో స‌హా నేనే దేవా కట్టాకు వివరించాను. నాకు ఎవరి కథలూ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు.

చంద్ర‌బాబు నాయుడు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి మధ్యగల స్నేహం నేపధ్యంలో ఓ సినిమా తెరకెక్కనుందని, ఆ చిత్రాన్ని విష్ణు ఇందూరి మరో నిర్మాతతో కలిసి నిర్మించనున్నారని వార్తలు వచ్చిన నేపధ్యంలో దేవా కట్టా మరోసారి తన కథను కాపీ కొట్టారనే కోపంతోనే గతంలో జరిగిన సంఘటన గురించి వెల్లడించారని తెలుస్తోంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.