Writer Thota Prasad Revealed Interesting Back Story of Ram Charan Chirutha Movie
Chirutha : సినీ పరిశ్రమలో ఒక కథ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లి ఏదో ఒక హీరో దగ్గర ఆగుతుంది. ఒక హీరో వదులుకున్న కథ ఇంకో హీరో చేస్తాడు. ఇది ఎప్పట్నుంచో జరుగుతూనే ఉంది. అయితే రామ్ చరణ్ చిరుత సినిమా కథ మాత్రం వేరే హీరోతో, వేరే డైరెక్టర్ తో ఒక షెడ్యూల్ షూట్ చేసి ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయి ఆ కథ చరణ్ దగ్గరికి వచ్చిందట. సీనియర్ రచయిత తోట ప్రసాద్ చిరుత సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపారు.
రచయిత తోట ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరుత కథ మొదట పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా అనుకున్నారు. ఆ కథని మెహర్ రమేష్ రాసుకున్నాడు. బ్యాంకాక్ కి వెళ్లి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేసేసారు. కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథ చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. నిర్మాత అశ్వినీదత్ కి మెహర్ రమేష్ దగ్గర ఆ కథ ఉందని తెలిసి దాని గురించి పూరి జగన్నాధ్ కి కూడా ఐడియా ఉండటంతో అది రామ్ చరణ్ కి కరెక్ట్ గా సరిపోతుందని భావించి చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు. చిరంజీవి కొడుకు అని దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని మార్పులు చేసి, హీరోని మరింత మాస్ గా చూపించడంతో చిరంజీవి ఓకే చెప్పారు. అయితే మెహర్ రమేష్ కి కాకుండా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి చిరంజీవి చరణ్ తో తీయమని ఆ కథని ఇచ్చారు అని తెలిపారు.
దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. అయితే సాయి రామ్ శంకర్ తో తీసేటప్పుడు ఈ కథ పేరు చిరుత కాదు. ఆ సినిమా ఆగిపోయాకే ఆ కథని కాస్త మార్చి చిరుత టైటిల్ పెట్టారు. కానీ అదే కథ సాయి రామ్ శంకర్ కి పడి ఉంటే ఇంకో పెద్ద హిట్ ఆ హీరోకి వచ్చేది అని భావిస్తున్నారు. చరణ్ చిరుత సినిమాతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని హిట్ కొట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
ఇక సాయి రామ్ శంకర్ మొదట్లో హిట్స్ కొట్టినా ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ చూసాడు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సాయి రామ్ శంకర్ వెయ్ దరువెయ్, ఒక పథకం ప్రకారం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా అవి రెండు పరాజయం పాలయ్యాయి.