చారిత్రక నిర్ణయం: ఓసీల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు

  • Publish Date - January 7, 2019 / 09:33 AM IST

ఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల పేదలకూ రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆర్థికంగా వెనుకబడిన ఎగువ కులాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయనుంది. 2019, జనవరి 8వ తేదీ మంగళవారం రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. అగ్రవర్ణాల్లో రూ.8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించేలా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది. ఈ నిర్ణయంతో జనరల్‌ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. అగ్రవర్ణాల్లో తమ పట్టును మరింత పెంచుకునేందుకు మోదీ సర్కార్‌ ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్టు విశ్లేషకలు చెబుతున్నారు. రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ, రాందాస్‌ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐ వంటి పలు ఎన్డీఏ మిత్రపక్షాలు.. అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే డిమాండ్‌ చేశాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50శాతం మించరాదని సుప్రీంకోర్టు పరిమితి విధించింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో ఆ శాతం 60కు పెరగనుంది.

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారింది. ఇది రాజకీయ లబ్ది కోసమే అని విపక్షాలు అంటున్నాయి. రైతులకు కూడా త్వరలోనే మోదీ ప్రభుత్వం తీపి కబురు చెబుతుందని భావిస్తున్నారు. రైతుకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ సర్కార్ చెబుతోంది. అయితే.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీంకోర్టు సూచించడంతో.. 12 శాతం రిజర్వేషన్లకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు సవరణలకు పార్లమెంట్ ఆమోదిస్తే… తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లకు అడ్డు తొలిగిపోయే అవకాశం ఉంది.