ఒకే వేదికపై 1100 హిందూ, ముస్లిమ్ జంటలకు పెళ్లిళ్లు : కనువిందు చేసిన అద్భుత దృశ్యం

  • Publish Date - February 13, 2020 / 10:17 AM IST

భారతదేశంలో మతసామరస్యం ఎన్నో సందర్భాలలో కనువిందు చేసింది. అటువంటి మరో అరుదైన అద్భుతమైన ఘటనకు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం వేదికయ్యింది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా హిందూ, ముస్లిములు భాయ్ భాయ్ అంటూ ఒకే వేదికపై ఒకటీ రెండూ కాదు ఏకంగా 1100మంది హిందూ, ముస్లిమ్ జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఈ అరుదైన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది. 

ఒకే వివాహ వేదికపై ఒకవైపు 15 మంది పురోహితులు వేదమంత్రాలు పఠిస్తుండగా…మరోవైపు 10మంది ఇమాంలు ఇస్లాం సంప్రదాయ పద్ధతిలో ఖురాన్ ప్రవచనాలు చదవి వినిపిస్తుండగా 1100మంది హిందూ, ముస్లిమ్ జంటలు సామూహిక వివాహాల్లో భాగంగా ఒక్కటయ్యారు. ఈ అరుదైన సామూహిక వివాహాలను అహ్మదాబాద్ కు చెందిన ఇస్సా ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఇండియా పబ్లిక్ ట్రస్టు నిర్వహించింది. పెళ్లి ఖర్చులు పెట్టుకోలేని పేద కుటుంబాలకు ఈ సామూహిక వివాహాలు వరంగా మారాయని మహమ్మదీ బానో  అనే వధువు చెప్పింది.  జితేంద్ర  అనే మరో వరుడు మాట్లాడుతూ..హిందూ ముస్లిములకు కలిసి మెలిసి జీవించటానికి మతసామరస్యాన్ని పెంపొందించటానికి ఇటువంటి వివాహాలు ఎంతో ఉపయోగకరమని అన్నాడు. 

వివాహాల కార్యక్రమం పూర్తి అయ్యాక నూతన వధూవరులకు నిర్వాహకులు బహుమతులు అందించారు. కన్నుల పండుగాగా జరిగిన ఈ హిందూ ముస్లిం సామూహిక వివాహ వేడుక మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ఈ సందర్భంగా  ట్రస్ట్ అధ్యక్షుడు మౌలానా హబీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆరు సంత్సరాల నుంచి ఇటువంటి వివాహఆలు చేస్తున్నామని గత ఏడాది హిందూ, ముస్లిం సమాజానికి చెందిన 501 జంటలకు వివాహాలు చేశామని..ఈ సంతర్సం ఆ సంఖ్య పెరగటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.