14 states furnished views on identification of minorities tells centre to sc
Minorities Identification: దేశ వ్యాప్తంగా మైనారిటీలు ఒక విధంగా ఉంటే, రాష్ట్రాల పరిధిలో మరో విధంగా ఉంటారు. ఉదహారణకు దేశ వ్యాప్తంగా ముస్లింలు, గిరిజనులు మైనారిటీలు అయితే.. జమ్మూ కశ్మీర్లో ముస్లింలు మెజారిటీలు. అక్కడ హిందువులు మైనారిటీ కోవలోకి వస్తారు. ఇక కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లు మెజారిటీగా ఉన్నారు. అక్కడ మిగతా వర్గాల వారు మైనారిటీల కోవలోకి వస్తారు. అయితే దేశం మొత్తం ఒకటే మైనారిటీ విధానం అమలు అవుతుండడంతో కొన్ని రాష్ట్రాల్లో ఉన్న నిజమైన మైనారిటీలకు అందాల్సిన లబ్దిని మెజారిటీలకు వెళ్తోందనే వాదనల నేపథ్యంలో రాష్ట్రాల వారీగా మైనారిటీలను గుర్తించే పనిలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది.
అయితే ఈ విషయమై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే 14 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు మంగళవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక మిగిలిన 19 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంకా ఎలాంటి అభిప్రాయం తమకు రాలేదని, ఇది సున్నితమైన అంశం కావడంతో తమ అభిప్రాయాలను తెలిపేందుకు తమకు మరికొంత సమయం కావాలని అత్యున్నత ధర్మాసనానికి కేంద్ర విజ్ణప్తి చేసింది. ఇందుకు ప్రభుత్వానికి సుప్రీం ఆరు వారాల గడువును ఇస్తూ విచారణను జనవరికి వాయిదా వేసింది.
న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని, రాష్ట్రాల వారీగా మైనారిటీలను గుర్తించి వారికి చేరాల్సిన ప్రభుత్వ లబ్దిని అందించాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో పిటిషన్ దారు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర మైనారిటీ వ్యవహరాల శాఖ దాఖలు చేసిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ కోర్టుకు హాజరయ్యారు. అక్టోబర్ 31న స్థాయీ నివేదికలను ఫైల్ చేసినట్టు ఆయన కోర్టుకు తెలిపారు.