1947లో జరిగింది పెద్ద తప్పే : గురుగోవింద్ స్మారక నాణేలు విడుదల

  • Publish Date - January 13, 2019 / 10:36 AM IST

గురుగోవింద్ సింగ్ జయంత్సోవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం(జనవరి13,2019) ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మోడీ స్మారక నాణేలను విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు తదితర సిక్కు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు చేశారు.

1984 నాటి సిక్కుఅల్లర్ల బాధితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోడీ అన్నారు. సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ అంశాన్ని ప్రస్తావిస్తూ… దర్శనం కోసం ఇకపై గురునానక్ భక్తులు పాకిస్తాన్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ను టెలిస్కోప్ ద్వారా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.1947 నాటి తప్పును సవరించడం జరిగిందని తెలిపారు.

సిక్కుల ఆరాధ్య దైవం కొలువైన ప్రాంతం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా దేశ విభజనలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడం పెద్ద తప్పిదమన్నారు. దీన్ని మనం పొందలేకపోయినా కర్తార్ పూర్ కారిడార్ ఆ భాధను కొంతమేర తగ్గిస్తుందని తెలిపారు. కర్తార్పూర్ కారిడార్ ద్వారా సిక్కు సోదరులు పాకిస్తాన్ లోని సరోవల్ దర్బార్ సాహిబ్ కు వీసా లేకుండా ప్రయాణించవచ్చని తెలిపారు. గురు గోవింద్ సింగ్ ని ఓ యోధుడుగా, కవిగా మోడీ వర్ణించారు.

గురునానక్  550వ జయంతోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని మోడీ అన్నారు. నాలుగేళ్లుగా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యోగా నుంచి ఆయుర్వేదం వరకు దేశం తన స్థానాన్ని తిరిగి పొందడంలో విజయం సాధించిందని మోడీ అన్నారు.