ఆఖరి అవకాశమిదే: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతున్న నిర్భయ హంతకుడు

2012 నిర్భయ గ్యాంగ్ రేప్ చేసిన హంతకుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ మరో ప్రయత్నం చేశాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలంటూ అభ్యర్థిస్తున్నాడు. చిట్ట చివరి అవకాశంగా మంగళవారం ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ను దయచూపాలంటూ వేడుకుంటున్నాడు. ఈ ముఖేశ్.. వినయ్ శర్మలు కలిసి మరణశిక్ష తప్పించాలంటూ సుప్రీం కోర్టులో వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను మంగళవారం కోర్టు కొట్టేసింది.

ఐదుగురు జడ్జిలతో ఉన్న కమిటీ సింగిల్ సిట్టింగ్ లోనే తీర్పునిచ్చింది. జనవరి 22 ఉదయం 7గంటలకు ఉరితీయాల్సి ఉంది. ఈ ఉరిశిక్ష కొట్టేసేంత వరకూ ఉరితీయడానికి లేదు. అయితే గతంలో ఇలాంటి దోషులు బతకడానికి వీల్లేదని రాష్ట్రపతి వెల్లడించిన సందర్భం ఉండడంతో క్షమాభిక్ష పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. 

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 

మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.