Supreme Court : మహిళలకు నెలసరి సెలవు తప్పనిసరి చేస్తే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court : మహిళల పీరియడ్ లీవ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి చట్టాలు చేస్తే కంపెనీలు మహిళలను తీసుకోవని కోర్టు అభిప్రాయపడింది.
Supreme Court
- మహిళల పీరియడ్ లీవ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
- రుతుక్రమం అంశంపై అవగాహన కల్పించండం మంచిది
Supreme Court : మహిళల పీరియడ్ లీవ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. అయితే, ఆ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read : Chennai Hotel Bill : ఓరేయ్.. ఎవర్రా నువ్వు..! ఇడ్లీ, వడతోపాటు గ్యాస్ ఛార్జీలతో బిల్లు.. నెటిజన్లు ఫుల్ ఫైర్
నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే అది మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనం అలాంటి చట్టాలు చేస్తే కంపెనీలు మహిళలను తీసుకోవని అభిప్రాయపడింది.
పిటిషనర్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. అలాంటి చట్టం తాము పురుషుల కంటే తక్కువ అనే భయం ఉద్యోగాలు చేసే మహిళల్లో సృష్టించే అవకాశం ఉంది. పీరియడ్ సమస్యపై, దాని సున్నితత్వంపై అవగాహన కల్పించడం వేరు.. దానిని సెన్సేషన్ చేయడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన మరుక్షణం ఎవరూ మహిళలను తమ కంపెనీల్లో నియమించుకునేందుకు ఆసక్తి చూపరు అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు అంటూ ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్‌ను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు.
అయితే, సీనియర్ న్యాయవాది షంషద్ తన వాదన వినిపిస్తూ.. 2013లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు నెలసరి సెలవును మంజూరు చేశారని, ప్రైవేట్ కంపెనీలు కూడా అలాంటి వెసులుబాటు కల్పించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. అవన్నీ స్వచ్చందంగా తీసుకున్న చర్యలు అని అన్నారు. నెలసరి సమయంలో మహిళలకు సెలవును తప్పనిసరి చేస్తే వారి కెరీర్ కే ఇబ్బందికరంగా మారుతుందని ప్రధాన న్యాయమూర్తి మరోసారి ప్రస్తావించారు.
గతంలో ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడ పిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని, ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్ కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్ , మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
