King Cobra
Snakes Found: పాము కనిపించిందంటే బాబోయ్ అంటూ ఆమడ దూరం పరుగెడతారు. అదే తీవ్ర విషపూరిత పాములైన నాగుపాము లాంటిది అయితే.. అలాంటివి ఒకేచోట గుంపుగా కనిపిస్తే.. ఇంకేముంది.. ఒక్కసారిగా ఒళ్లు ఝల్లుమనడం ఖాయం. ఇలాంటి ఘటన బీహార్‌లోని బగహ జిల్లా మధుబని గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామంలోని మదన్ చౌదరి తన ఇంటి మెట్ల కింద డ్రెస్సింగ్ టేబుల్ ఉంచాడు. ఇంట్లోని పిల్లలు ఆ మెట్ల దగ్గర ఆడుకుంటూ ఉండగా వారి పక్కనుంచే నాగు పాము వెళ్లింది. పిల్లలు ఒక్కసారిగా కేకలు వేశారు. వారి కేకలు విన్న కుటుంబ సభ్యులు డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వచ్చి చూడగా నాగుపాము కనిపించింది. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Anganwadi Snakes : బాబోయ్.. అంగన్‌వాడీ కేంద్రంలో 40 పాములు, తేళ్లు
పిల్లల అరుపులు విన్న చుట్టుపక్కల ఇళ్లవారుసైతం అక్కడికి చేరుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ కింద నుంచి మరో నాగు పాము బయటకు రావటంతో, ధైర్యంచేసి డ్రెస్సింగ్ టేబుల్‌ను కొంచెం జరిపి చూశారు. మరో నాలుగు పాములు కనిపించడంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పాముల సంరక్షకుడికి సమాచారం ఇచ్చారు. అతడు అక్కడకు చేరుకొని డ్రెస్సింగ్ టేబుల్ కింద చూడగా.. 24 నాగు పాములు కనిపించాయి. ఒక్కసారిగా కుటుంబ సభ్యుల గుండె ఆగినంత పనైంది. 24 నాగు పాములతో పాటు 60 గుడ్లు కనిపించాయి. ఆ పాములను, గుడ్లను ఒక బస్తాలో వేసిన పాముల సంరక్షకుడు వాటిని గండకీ నది ఒడ్డుకు తీసుకెళ్లి వదిలేశాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులతోపాటు, చుట్టు పక్కల ప్రజలుసైతం భయాందోళనకు గురయ్యారు. పిల్లలు రోజూ ఆ ప్రాంతంలోనే ఆడుకుంటున్నారని, అదృష్టవశాత్తూ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇంటి యాజమాని మదన్ చౌదరి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాబోయ్.. పెద్ద ప్రమాదమే తప్పింది అంటూ చర్చించుకుంటున్నారు.