ఏంటీ మిస్టరీ : నది ఒడ్డున 3 వేల ఆధార్ కార్డులు

  • Publish Date - May 16, 2019 / 10:40 AM IST

ఆధార్ కార్డు.. అన్నింటికీ ఆధారం ఇదే. ప్రతిదానికీ ఐడీ ఫ్రూఫ్ అయిపోయింది. ఆధార్ కార్డును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.. అవును.. ప్రతి ఒక్కరూ భద్రంగా పెట్టుకుంటున్నారు. అలాంటి ఆధార్ కార్డులు కుప్పలు కుప్పులు దొరికాయి. నది ఒడ్డున పడి ఉన్న కార్డులతో తమిళనాడులో కలకలంగా మారింది.

తమిళనాడులోని తిరువరూర్ జిల్లా తిరుతురైపూండి దగ్గరలోని ముల్లియారు నది ఉంది. ఆ నది ఒడ్డున ఆధార్ కార్డులు కుప్పలుగా దొరికాయి. మొత్తం లెక్కిస్తే 3 వేల ఆధార్ కార్డులు. గురువారం (మే 15, 2019) పిల్లలు నది ఒడ్డున ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడ నాలుగు గన్నీ బ్యాగులు గుర్తించారు. ఆ బ్యాగులను తెరిచి చూడగా అందులో ఆధార్ కార్డులను ఉండటాన్ని గమినించారు.

సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులకు ఘటనాస్థలికి చేరుకుని ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కట్టిమేడు, వాడపతి, ఆతిరంగం గ్రామాల ప్రజలకు చెందిన ఆధార్ కార్డులుగా గుర్తించారు. ఆధార్ కార్డులు ఎక్కువగా డ్యామేజీ కావడంతో వాటిపైనున్న పేర్లు, అడ్రస్ చదవడానికి కష్టమవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇన్ని వేల ఆధార్ కార్డులు నది ఒడ్డున బ్యాగుల్లో పెట్టి ఎందుకు వదిలేశారు అనేది ఆసక్తిగా మారింది. అన్ని ఆధార్ కార్డులు లామినేషన్ చేసి ఉన్నాయి. ఇవి ఒరిజినల్ ఆధార్ కార్డులు, డూప్లికేటా అనేది కూడా పరిశీలిస్తున్నారు.

ఎన్నికల సమయంలో వీటిని పార్టీలు సేకరించి ఉంటాయని.. ఆ తర్వాత ఇలా పారేసి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. 3వేల ఆధార్ కార్డులు లభ్యం కావటం మాత్రం సీరియస్ గా తీసుకుంది రెవెన్యూ శాఖ.