16 ఏళ్లలోపు పిల్లలు స్మార్ట్ఫోన్లు వాడకుండా నిషేధం!
ఈ నిషేధ చర్యలు మైనర్లకే వర్తిస్తాయని, ఇతర విద్యార్థులపై ప్రభావం ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు.
Karnataka: కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. పిల్లల్లో సామాజిక మాధ్యమాల వ్యసనం, దాని ప్రభావాలపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని సర్కారు భావిస్తోంది.
దీన్ని అమలు చేసే అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే విశ్వవిద్యాలయాల వైస్ చాన్సరల్లతో సంప్రదింపులు మొదలుపెట్టారు.
బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన వైస్ చాన్సరల్ల సమావేశంలో పాల్గొన్న సిద్ధరామయ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందని, మైనర్లపై పరిమితులు విధించడం అవసరమా? అనే విషయంపై అభిప్రాయాలు కోరారు.
Also Read: రచయిత శ్రీనివాస్ హత్య మిస్టరీ వీడింది.. స్నేహితుడిని చంపేసి, కారును రిజర్వాయర్‌లోకి నెట్టి..
“ఇది చర్చల దశలో ఉంది. వైస్ చాన్సలర్ల అభిప్రాయాలు కావాలి. పిల్లలు మత్తు పదార్థాలకు బలవుతున్నారు. ఆస్ట్రేలియాలోలా విద్యార్థులు మొబైల్ వినియోగించకుండా నిషేధం విధించాలని భావిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం కావాలి” అని సిద్ధరామయ్య చెప్పారు.
ఈ నిషేధ చర్యలు మైనర్లకే వర్తిస్తాయని, ఇతర విద్యార్థులపై ప్రభావం ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యాసంస్థలు మత్తు పదార్థాల ప్రభావం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా వీసీలకు సూచించారు.
అధికారుల సమాచారం ప్రకారం.. స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం విద్యార్థుల ప్రవర్తన, మానసిక ఆరోగ్యం, చదువుపై ప్రభావం చూపుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలపై అధికంగా గడపడం పిల్లల అభివృద్ధిని దెబ్బతీస్తోందని, హానికర ప్రభావాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది.
