Fish Chicken: ఇక చేపలు, చికెన్పైనా.. సిగరెట్ లాంటి ఆరోగ్య హెచ్చరికలు..?
పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే చేపలు, మాంసాన్ని కూడా ఆరోగ్యానికి హానికరం అని పరిగణిస్తున్నాం. వీటిని పిల్లలకు దూరంగా ఉంచాలి.
Fish Chicken Representative Image (Image Credit To Original Source)
- మాంసాహారం పిల్లలను హింసాత్మకంగా మారుస్తుంది
- పాఠశాలల దగ్గర మాంసం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది
- విద్య, మతపరమైన సంస్థల సమీపంలో మాంసం చేపలు బహిరంగ అమ్మకాలు ఉండొద్దు
Fish Chicken: ఆరోగ్యానికి హానికరం.. అని సిగరెట్ ప్యాక్ లపై ఆరోగ్య హెచ్చరికలు రాసి ఉంటాయి. అంటే, వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని దాని అర్థం. ధూమపానం మంచిది కాదని చెప్పడం దీని వెనుకున్న ఉద్దేశ్యం. సరిగ్గా ఇలాంటి హెచ్చరికే చేపలు, చికెన్ కు కూడా వర్తిస్తుందా? బీహార్ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు, ఎందుకు వివాదం చెలరేగిందో తెలుసుకుందాం..
మాంసాహారం పిల్లలను హింసాత్మకంగా మారుస్తుందని, అందుకే పాఠశాలల దగ్గర మాంసం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా అన్నారు. ”ప్రజారోగ్యం, సామాజిక సామరస్యం, పిల్లల్లో హింసాత్మక ధోరణులను నివారించడం అనే కోణంలో.. రద్దీగా ఉండే ప్రదేశాలు, విద్య మతపరమైన సంస్థల సమీపంలో మాంసం చేపల బహిరంగ అమ్మకాలు ఉండకూడదని మేము విశ్వసిస్తున్నాము” అని విజయ్ కుమార్ సిన్హా చెప్పారు. ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమే అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
”పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే చేపలు, మాంసాన్ని కూడా ఆరోగ్యానికి హానికరం అని పరిగణిస్తున్నాం. వీటిని పిల్లలకు దూరంగా ఉంచాలి. కేంద్ర చట్టం ప్రకారం ఏ విద్యా సంస్థకైనా 100 గజాల పరిధిలో పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తుల అమ్మకంపై నిషేధం ఉంది” అని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా గుర్తు చేశారు.
డిప్యూటీ సీఎం సిన్హా వ్యాఖ్యలను కొందరు తప్పు పడుతున్నారు. మాంసాహారం తీసుకోవడం వల్ల పిల్లల్లో దూకుడు పెరుగుతుందనేది సైన్స్ లో లేదన్నారు. ఎర్ర మాంసం ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల భారతీయ పురుషులలో దూకుడు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయని చెప్పారు.
అపోహకు ఆజ్యం పోయడమే..
డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా వ్యాఖ్యలు కేవలం ఒక అపోహకు ఆజ్యం పోయడమే అని అభిప్రాయపడ్డారు. దేశ జనాభా, ముఖ్యంగా పిల్లల పోషక అవసరాలను తీర్చడానికి తీసుకుంటున్న చొరవలకు కూడా విరుద్ధంగా ఉన్నాయని పెదవి విరిచారు. దేశ జనాభాలో 70% మంది రోజువారీ అవసరాల కంటే తక్కువ ప్రోటీన్‌ను వినియోగిస్తున్నారు, ప్రోటీన్ లోపం “నిశ్శబ్ద” ఆరోగ్య సంక్షోభంగా ముద్ర వేయబడిందని వివరించారు.
కౌమారదశలో ఉన్న బాలికలను గుడ్లకు దూరంగా ఉంచడం వల్ల వారు లైంగికంగా చురుగ్గా ఉంటారు అన్నది కూడా అపోహే అన్నారు. ఇక, స్కూల్స్ కి సమీపంలోని చేపలు, మాంసం దుకాణాలు పిల్లలలో వినియోగాన్ని ఎలా పెంచుతాయి? ఈ దుకాణాలు తినడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను విక్రయించవు కదా అని డిప్యూటీ సీఎం వాదనలను ఖండించారు.
ఇంకా చెప్పాలంటే.. బహిరంగ, నియంత్రణ లేని దుకాణాల ద్వారా చేపలు మాంసం అమ్మకాలను నిషేధించే చర్యను పరిశుభ్రత కోసం మాత్రమే సమర్థించవచ్చని అన్నారు. ఆహార కాలుష్యం, అపరిశుభ్రమైన ప్రాంతాల కారణంగా వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇది చాలా ముఖ్యం అన్నారు. వేలాది మంది పిల్లలు చదువుకునే స్కూల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు.
బీహార్‌లో ఎక్కువ శాతం చేపలు మాంసం దుకాణాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఎంపికను అనుమతించకుండా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటే లక్షలాది మందికి మాంసాహార ఆహారం అందుబాటులో ఉండదు. డిప్యూటీ సీఎం సిన్హా వ్యాఖ్యలు.. పరిశుభ్రతను కాపాడుకోవడం, ప్రజారోగ్యం వైపు దృష్టి సారించడంలా లేవని.. మాంసాహార వినియోగాన్ని అరికట్టడమే ఆయన అసలు ఉద్దేశమా అని అనుమానం కలిగిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆహారపు అలవాట్లను రాజకీయం చేసే ప్రమాదం..!
స్కూల్స్ దగ్గర మాంసం, చేపల అమ్మకాలు.. పిల్లల్లో హింసకు లింక్ పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ వాదనకు శాస్త్రీయ మద్దతు లేదంటున్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు పోషకాహారం, పరిశుభ్రత, ఆహార స్వేచ్ఛ గురించి ఆందోళనలు రేకెత్తించేలా ఉన్నాయంటున్నారు. మంత్రి వ్యాఖ్యలు ఇప్పటికే ప్రోటీన్ లోపంతో పోరాడుతున్న దేశంలో ఆహారపు అలవాట్లను రాజకీయం చేసే ప్రమాదం ఉందన్నారు.
ఓవరాల్ గా చూస్తే.. ఈ సీనియర్ రాజకీయ నాయకులు ఆహారం గురించి అపోహలను ఎందుకు వ్యాప్తి చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సిన్హా వంటి బీజేపీ నాయకులు పిల్లలకు పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పొగాకు ఉత్పత్తుల మాదిరి చేపలు, కోడి మాంసానికి ఆరోగ్య హెచ్చరికలు అవసరమే లేదంటున్నారు.
Also Read: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ బ్రేకింగ్, ఇక PF డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి.. ఎవరు అర్హులు?
