Love Jihad: ఉత్తరప్రదేశ్ లో తీసుకొచ్చిన కొత్త చట్టం లవ్ జీహాద్ నెల రోజులు గడవకముందే అమితమైన స్పందన వచ్చింది. డజనుకు పైగా ఎఫెఐఆర్‌లు నమోదుకావడంతో పాటు 35మంది అరెస్టుకు గురయ్యారు. బలవంతంగా మత మార్పిడి చేయడాన్ని నిషేదిస్తూ నవంబర్ 27న చట్టం తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా ఎతాహ్ నుంచి ఎనిమిది మంది, సీతాపూర్ నుంచి ఏడుగురు, గ్రేటర్ నోయిడా నుంచి నలుగురు, షాజహాన్‌పూర్, ఆజంఘర్ నుంచి ముగ్గురు, మొరదాబాద్, ముజఫ్ఫర్ నగర్, బిజ్నోర్, కన్నౌజ్ ల నుంచి ఇద్దరు, బరేలీ, హార్దోయ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున అరెస్టు అయినట్లు అధికారులు చెబుతున్నారు.
చట్టం ఆమోదం పొందిన వెంటనే తొలి కేసు బరేలీలో నమోదైంది. 20సంవత్సరాల యువతికి తండ్రి అయిన తికారం రాథోడ్ అదే జిల్లా షరీఫ్ నగర్ గ్రామానికి చెందిన ఉవైశ్ అహ్మద్ (22)పై ఫిర్యాదు చేశాడు. తన కూతురితో ఫ్రెండ్ షిప్ చేసి ఆ తర్వాత బలవంతంగా మతమార్పిడి ద్వారా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పడంతో డిసెంబర్ 3న అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత మతాంతర వివాహాలపై పోలీసులు నిఘాపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని లక్నోలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా జరుగుతున్న మతాంతర వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు ముందుగా లీగల్ ఫార్మాలిటీలు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.
ముజఫ్ఫర్ నగర్ జిల్లాలో నదీమ్ అనే వ్యక్తిని డిసెంబర్ 6న బలవంతంగా హిందూ యువతిని పెళ్లి చేసుకుంటున్నాడనే కారణంతో అరెస్ట్ చేశారు. అలహాబాద్ హై కోర్టు నిందితుడిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పిన తర్వాత అతణ్ని విడుదల చేశారు. అలాగే మొరదాబాద్ లో రషీద్, సలీం అనే ఇద్దరు సోదరులను డిసెంబర్ 4న అరెస్టు చేశారు.
రషీద్ అనే వ్యక్తి హిందూ యువతిని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని యువతి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. ఇలా యువతి తరపు నుంచి అభ్యంతరం ఉన్నా లేకపోయినా, ఆమె ఇంటి సభ్యులు నమోదు చేసిన ఫిర్యాదు మేరకు యువకుడ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాతే ఇటువంటి వివాహాలు చెల్లుతాయని పోలీసులు సూచనలు ఇస్తున్నారు.