Plasma Donation: కరోనా కాలంలో 9సార్లు ప్లాస్మా డొనేట్ చేసిన 52ఏళ్ల డాక్టర్

కరోనా కష్టకాలంలో ఏకంగా 9 సార్లు ప్లాస్మా దానం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు డాక్టర్. వైద్యులు సమయం వెచ్చించి సర్వీసుతో...

Plasma Donation

Plasma Donation: కరోనా కష్టకాలంలో ఏకంగా 9 సార్లు ప్లాస్మా దానం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు డాక్టర్. వైద్యులు సమయం వెచ్చించి సర్వీసుతో ప్రాణాలు కాపాడటం చూశాం. కానీ, ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు ఇది తెలిసిన వారంతా. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం కనిపిస్తూనే ఉంది. ఇదిగాక మనకున్న మరో సమస్య ప్లాస్మా.

ఓ వైద్యుడిగా ప్లాస్మా అవసరం గురించి తెలిసిన బెంగళూరుకు చెందిన డాక్టర్ శ్రీకాంత్, ఇప్పటివరకు 9 సార్లు ప్లాస్మా డొనేట్ చేశాడు. అవసరమైతే మరోసారి దానం చేసేందుకు ముందుంటా అంటున్నాడు. గతేడాది ఆగష్టులో కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నాడు 52 ఏళ్ల శ్రీకాంత్.

కరోనా నుంచి కోలుకుంటే యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లు ప్లాస్మా దానం చేస్తే, ఇతర రోగులకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే శ్రీకాంత్ అప్పట్నుంచి ప్లాస్మా దానం చేస్తూనే ఉన్నాడు. అలా తను సేవలందిస్తోన్న మణిపాల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో 9 సార్లు ప్లాస్మా దానం చేశాడు.

ప్రతిసారి రక్తపరీక్ష చేయించుకుంటాడు శ్రీకాంత్. శరీరంలో యాంటీ బాడీస్ పెరిగిన వెంటనే వెళ్లి ప్లాస్మా డొనేట్ చేస్తాడు. అలా ఒకసారి డొనేట్ చేసిన ప్లాస్మా ఇద్దరికి ఉపయోగపడుతుంది. అలా శ్రీకాంత్ ఇప్పటివరకు 18 మంది కరోనా రోగుల్ని కాపాడినట్టయింది.

18వ ఏట నుంచి బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాడు శ్రీకాంత్. ఇప్పుడు కరోనా టైమ్ లో ఇలా ప్లాస్మా డొనేట్ చేసి చాలామంది పాలిట దేవుడిగా మారాడు. ప్లాస్మా ట్రీట్మెంట్ కరోనా రోగిని వెంటిలేటర్ పైకి వెళ్లే బాధ నుంచి తప్పిస్తుంది.