Uttar Pradesh: యూపీలో వైద్యుడి పైశాచికం.. లంచం ఇవ్వలేదని అతికిన ఎముకను మళ్లీ విరగ్గొట్టి.. గిలగిలా కొట్టుకున్న బాలిక

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఒక పైశాచిక వైద్యుడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని అతికిన కాలును మళ్ళీ విరగొట్టిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

A doctor re-broke a healed bone because a bribe was not paid in Uttar Pradesh

  • లంచం కోసం కాలు విరిచిన డాక్టర్
  • ఉత్తరప్రదేశ్‌లో అమానుష వైద్యుడి పైశాచిక ప్రవర్తన
  • బాధిత బాలికకు తక్షణ న్యాయం కావాలి

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే పైశాచికంగా ప్రవర్తించాడు. రేష్మ అనే నిరుపేద మహిళకు చెందిన 14 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తె కాలు విరగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, అక్కడి సిబ్బంది సర్జరీ కోసం రూ. 25 వేల లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న ఆ తల్లి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించగా, ఉచిత వైద్యం అందించాలని ఆదేశాలు వచ్చాయి. అయినా వినని సిబ్బంది ఒత్తిడి చేయడంతో ఆమె అతికష్టంపై రూ. 8 వేలు చెల్లించింది. దాంతో డాక్టర్ చతుర్వేది ఆ బాలికకు శస్త్రచికిత్స పూర్తి చేశాడు.

Massive Fire Breaks Out : అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. భవనం అంతటా వేగంగా వ్యాపించిన మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

మిగిలిన లంచం డబ్బులు తీసుకురావాలని సదరు వైద్యుడు ముందే హెచ్చరించాడు. తదుపరి పరీక్షల సమయానికి రేష్మ మిగతా డబ్బులు చెల్లించలేకపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ డాక్టర్, బాలిక నడకను పరీక్షిస్తాననే నెపంతో ఆమె కాలిని గట్టిగా మెలితిప్పాడు. ఆ చిన్నారి నొప్పితో అల్లాడిపోతున్నా వదలకుండా, ఎముకను సరిచేస్తున్నానంటూ నమ్మబలికి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్ళాక కూడా బాలిక బాధ భరించలేకపోవడంతో, తల్లి ఆమెను మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించింది. అప్పుడు అసలు నిజం బయటపడింది.

వైద్యుడు లంచం ఇవ్వలేదనే కక్షతో సర్జరీ చేసి అతికించిన ఎముకను ఉద్దేశపూర్వకంగానే మళ్లీ విరగ్గొట్టినట్లు ఎక్స్-రే రిపోర్టులో తేలింది. సమాజంలో దేవుడిలా భావించే వైద్యుడే ఇలాంటి పైశాచికత్వానికి ఒడిగట్టడంపై బాధితురాలి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ అమానుష ఘటనపై ముజఫర్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) స్పందిస్తూ, సదరు వైద్యుడిపై తక్షణమే విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది.