Bihar News: ఊహించని ట్విస్ట్.. పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. ఖాతాలో రూ.1500 కోట్లు ప్రత్యక్షం.. తరువాత ఏం జరిగిందో తెలుసా?
పింఛన్ డబ్బులు పడ్డాయో చూసుకోవడానికి వెళ్లిన ఒక బీహార్(Bihar News) సామాన్యుడికి ఊహించని విధంగా కోట్లాది రూపాయల నగదు కనిపించి షాక్‌కు గురయ్యారు.
- V Santhosh Kumar
- Published on- July 13, 2026 / 11:09 AM IST
A person found 1,500 crore in their account upon checking the balance at Bihar
- రూ.1500 కోట్ల భారీ నగదు.
- తండ్రీకొడుకుల ఖాతాల్లో ప్రత్యక్షం.
- బ్యాంకు సాంకేతిక లోపం.
Bihar News: బ్యాంకు ఖాతాలో పింఛన్ డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడానికి వెళ్లిన ఒక సామాన్యుడికి, ఊహించని విధంగా కోట్లాది రూపాయల నగదు కనిపించి షాక్‌కు గురిచేసిన అరుదైన ఘటన బీహార్(Bihar News)లో వెలుగుచూసింది. సాధారణంగా వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూసే పేద కుటుంబాల ఖాతాల్లో ఇలాంటి భారీ మొత్తాలు కనిపించడం సంచలనంగా మారింది.
ముజఫర్‌పుర్‌కు చెందిన 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా అనే వృద్ధుడు తన పెన్షన్ డబ్బులు డ్రా చేయడానికి స్థానిక ‘కామన్ సర్వీస్ సెంటర్’కు వెళ్లారు. అక్కడ డబ్బులు తీసుకున్న తర్వాత, తన అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో చూసి చెప్పమని సిబ్బందిని కోరారు. వారు తనిఖీ చేయగా, ఆ వృద్ధుడి ఖాతాలో ఏకంగా రూ. 759 కోట్లు ఉన్నట్లు చూపించింది. ఆశ్చర్యపోయిన సిబ్బంది, వెంటనే పక్కనే ఉన్న ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాను కూడా పరిశీలించగా, అందులోనూ సరిగ్గా రూ. 759 కోట్లే జమ అయి ఉండడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి ఖాతాల్లో కలిపి మొత్తంగా రూ. 1,500 కోట్లకు పైగా నగదు కనిపించడంతో సీఎస్‌సీ సిబ్బంది వెంటనే పోలీసులకు, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. బ్యాంకు వ్యవస్థలో తలెత్తిన ఏదైనా సాంకేతిక లోపం వల్లే ఈ రెండు ఖాతాల్లోకి ఇంత భారీ మొత్తంలో నగదు బదిలీ అయి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ పొరపాటు ఎక్కడ, ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.
