GHMC అధికారం కోసం AAP.. హైదరాబాద్‌కు కేజ్రీవాల్

  • Publish Date - February 18, 2020 / 08:10 PM IST

ఢిల్లీలో మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకున్న జోష్‌తో దేశంలోని ఇతర రాష్ట్రాలకూ పార్టీని విస్తరించాలనే ఆలోచనలో ఉంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఢిల్లీలో ఆప్ ఘనవిజయానికి సుపరిపాలనే కారణమనే ప్రచారం జరగడంతో… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే రకమైన నినాదంతో ముందుకు సాగాలని ఆ పార్టీ యోచిస్తోందంట. ఆప్‌ గెలుపు కోసం నగరం నుంచి సైతం కొంతమంది ఆప్ కార్యకర్తలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆప్‌కు ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో… జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఢిల్లీ తరహా పాలన చేస్తామనే హామీలతో ప్రజల ముందుకు వెళ్లాలని ఆప్ స్థానిక నేతలు భావిస్తున్నారట.

కేజ్రీవాల్‌తో నగరంలో ప్రచారం :
అవసరమైతే కేజ్రీవాల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ప్రచారం చేయించాలని పలువురు నేతలు భావిస్తున్నారని సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ తరఫున టికెట్లు రానివారు ఆప్ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అది కూడా ఆప్‌కు కలిసొచ్చే అంశమని ఆ పార్టీ భావిస్తోందని అంటున్నారు. వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందస్తుగానే ప్రణాళికలతో సిద్ధంకావాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నారట. మొత్తానికి ఢిల్లీలో ఆప్ సాధించిన ఘనవిజయం… హైదరాబాద్‌లోని ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపినట్టు కనిపిస్తోందని జనాలు అనుకుంటున్నారు. 

అన్ని స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాం :
హైదరాబాద్‌తోపాటు ఇకపై దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆప్‌ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ ప్రకటించడం ఈ ప్రచారానికి బలాన్నిస్తోంది. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా కేజ్రీవాల్‌ దృష్టి పెట్టబోతున్నారు. పార్టీని విస్తరించుకోవడంతోపాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి వాలంటీర్లను సిద్ధం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లనుంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి తమ పార్టీని విస్తరించుకుంటే భవిష్యత్తులో మరిన్ని నగరాల్లోకి కూడా పార్టీని తీసుకెళ్లేందుకు వీలుంటుందని భావిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో తొలుత పార్టీ విస్తరణ జరిగితే.. ఆ తర్వాత మెల్లగా పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్రవేశించేందుకు వీలు అవుతుందని అంచనా వేస్తున్నాయని అనుకుంటున్నారు. మొత్తం మీద ఢిల్లీ జోష్‌తో జీహెచ్ఎంసీ మీద ఆప్‌ కన్ను వేయడంతో బీజేపీలో చలనం మొదలైందంటున్నారు.