ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకుండా డిగ్రీలు ఇవ్వలేం: యూజీసీ

ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకుండా డిగ్రీలు ఇవ్వలేం: యూజీసీ

Updated On : August 10, 2020 / 3:28 PM IST

యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షల రద్దు అంశంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తవకుండా డిగ్రీ ప్రధానం చేయలేమనేది యూజీసీ వాదన. యూజీసీ త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడారు. ఈ డిగ్రీలు అందించే ప్రోసెస్ లో రూల్స్‌ను రెడీ చేసే హ‌క్కు కేవ‌లం యూజీసికి మాత్ర‌మే ఉంద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు యూజీసీ నియ‌మావ‌ళిని మార్చ‌లేవ‌ని స్పష్టం చేశారు.



కొవిడ్-19 ఉన్నప్పటికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా విద్యార్థులకు డిగ్రీలు అప్పగించలేమని యూజీసీ చెప్పింది. ఈ కేసును సుప్రీంకోర్టు ఆగ‌స్టు 14కు వాయిదా వేసింది. ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ంటూ ప్రకటించాయి. సుప్రీం.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాల ప‌ట్ల స్పందించేందుకు యూజీసీకి కొంత గ‌డువిచ్చింది.



అశోక్ భూష‌ణ్, సుభాష్ రెడ్డి, షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తుంది. సెప్టెంబ‌ర్ 30వ తేదీలోగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని గ‌తంలోనే యూజీసీ చెప్పేసింది. యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఓవ‌ర్‌రైడ్ చేస్తుందా అని ఈ సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. విద్యార్థులు ప‌రీక్ష‌లు రాసి పాస్ అవనంత వరకూ వారికి డిగ్రీలు ఇవ్వ‌లేమని మెహ‌తా తెలిపారు.