అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 24న ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ట్రంప్ మొతేరా స్టేడియంలో ఉంటారు. ట్రంప్ రాక నేపథ్యంలో గుజరాత్ ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు అధికారులు. ట్రంప్ వెళ్లే దారితో పాటు మొతేరా స్టేడియం చుట్టు పక్కల ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. ఎక్కడా స్లమ్ ఏరియాలు కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మొతేరా స్టేడియం సమీపంలోని దేవ్ సరన్ స్లమ్ ఏరియా కనిపించకుండా గోడ కట్టేశారు. దీంతో మురికి వాడలో ఉంటున్న పేదలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మురికి వాడలో నివాసం ఉంటున్న వారికి షాక్ ఇచ్చారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు.
ఆ స్లమ్ ఏరియాలో సుమారు 65 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారందరికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అధికారులతో తీరుతో అక్కడ నివాసం ఉంటున్నవారు ఆవేదన చెందుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని వాపోయారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారంతా భవన నిర్మాణ కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పని చేస్తే ముద్ద దొరుకుతుంది. లేదంటే పస్తులు ఉండాల్సిందే. మొతేరా స్టేడియానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్లమ్ ఏరియాలో.. 22 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని స్థానికులు చెప్పారు.
తామంతా నిరు పేదలం అని, ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమంటే.. ఎక్కడికి వెళ్లాలని వారు వాపోయారు. ఒక్కో కుటుంబాలో నలుగురు అంతకన్నా ఎక్కువమంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు, వృద్దులు ఉన్నారు. ముందస్తు సమాచారం లేకుండా సడెన్ గా వెళ్లిపోండి అంటే.. ఎక్కడికి వెళ్లాలని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు.
”వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ట్రంప్ వస్తున్నాడని ఖాళీ చేయమన్నారు. 22 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము. మేమంతా కూలీలం. రోజుకు రూ.300 కూలీ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం అని అంటున్నారు. ప్రతి కుటుంబంలో నలుగురు అంతకన్నా ఎక్కువమంది ఉన్నాము. సడెన్ గా వెళ్లిపోండి అంటే.. ఎక్కడికి వెళ్లాలి. మెరుగైన జీవనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కడుపు చేత పట్టుకుని అహ్మదాబాద్ వచ్చాము. మాకు మరో ఆధారం లేదు. అధికారులేమో.. వెళ్లిపోండి అంటున్నారు. పిల్లలు, వృద్దులతో ఎక్కడికి వెళ్లాలి. పేద వాళ్లు కావడం మేము చేసిన నేరమా?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ట్రంప్ పర్యటనకు నోటీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందని.. ఆక్రమణకు గురైందని చెప్పారు. ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవడానికే.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చామన్నారు.
Read More>>భారత్‌లో తొలి కరోనా వైరస్ మరణం..?