Air India Hijack Alert : ఎయిర్ ఇండియా విమానం నుంచి హైజాక్ అలర్ట్.. రంగంలోకి భద్రతా బృందాలు.. అసలేం జరిగిందంటే?

Air India Hijack Alert : ఎయిర్ ఇండియా విమానం నుంచి హైజాక్ అలర్ట్ రావడం తీవ్ర కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Air India Hijack Alert

Air India Hijack Alert : ఎయిర్ ఇండియా విమానం నుంచి హైజాక్ అలర్ట్ రావడం తీవ్ర కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవటంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేశారు. విమానాన్ని ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. భద్రతా బృందాలుసైతం వెంటనే రంగంలోకి దిగాయి.

Also Read : Vijayasai Reddy Party : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. కొత్త పార్టీ పేరును ప్రకటించిన విజయసాయిరెడ్డి.. లక్ష్యం ఇదే..

కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో దాని టాయిలెట్‌లో హైజాక్ చేస్తామంటూ రాసిన హెచ్చరిక నోట్ కనిపించింది. దీంతో పైలెట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు హైజాక్ అలర్ట్ ఇచ్చారు. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది.. టేకాఫ్‌ను నిలిపివేసి.. ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన AI 772 విమానం కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సి ఉంది. ఉదయం 10.20 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానంలోని టాయిలెట్‌లో అనుమానాస్పద హెచ్చరిక సందేశాన్ని గుర్తించారు. విమానం ఉదయం 11.10 గంటలకు హైజాక్ అవుతుందంటూ ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఈ విషయం బయటపడగానే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికులందరిని కిందకు దించి.. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. అక్కడ భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి ప్రమాదకర వస్తువులు ఉన్నాయా? హెచ్చరిక నోట్ ఎవరు రాశారు? అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఈ విమానంలో 93 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.

హైజాక్ హెచ్చరిక నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. సంబంధిత భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయి. విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి విమానం హైజాక్‌కు గురైనట్లు ఎలాంటి సమాచారం లేదు. కేవలం హెచ్చరిక నోట్ కనిపించడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు.