×
Ad

ఈ ట్రైన్లలో ఆర్‌ఏసీ ఉండదు.. ఓన్లీ కన్ఫార్మ్‌ స్లీపర్‌ క్లాస్‌.. చార్జీలు ఎంతో తెలుసా?

రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. స్లీపర్ క్లాస్‌లో మూడు కోటాలు మాత్రమే ఉంటాయి. మహిళా కోటా, వికలాంగుల కోటా (పీడబ్ల్యూడీ), సీనియర్ సిటిజన్ కోటా.

Amrit Bharat II Express train PIC: @IndianTechGuide

  • ఎంత దూరానికి, ఎంత కనీస చార్జ్‌?
  • బేసిక్ చార్జీలు స్లీపర్‌ క్లాస్‌కి 200 కి.మీ వరకు రూ.149
  • సెకండ్‌ క్లాస్‌కి రూ.50 కి.మీ వరకు రూ.36 
  • ఆ లోపు ప్రయాణించినా అంతే చార్జ్

Amrit Bharat II Express: సవరించిన చార్జీలతో అమృత్‌ భారత్‌ II ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను తీసుకొస్తోంది భారతీయ రైల్వే. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సర్వీసులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. సుదీర్ఘ ప్రయాణాలు చేసే సామాన్యులకు అందుబాటు ధరలో, ఆధునిక ఫీచర్లతో రైల్వే శాఖ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలను నడుపుతున్న విషయం తెలిసిందే.

కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్‌ భారత్‌ II ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల టికెట్‌ ధరలు వేరుగా ఉంటాయి. వీటిలో కనీస చార్జీల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కనీస చార్జీ దూరాన్ని స్లీపర్ క్లాస్‌లో 200 కిలోమీటర్లు, సెకండ్ క్లాస్‌లో 50 కిలోమీటర్లుగా నిర్ణయించారు.

అంటే, స్లీపర్ క్లాస్‌లో 200 కిలోమీటర్ల దూరానికి ఎంత చార్జీ వేస్తారో, అంతకంటే తక్కువ ప్రయాణం చేసినా అంతే చార్జీ ఉంటుంది. అలాగే, సెకండ్ క్లాస్‌లో 50 కిలోమీటర్ల దూరానికి ఎంత చార్జీ ఉంటుందో, అంతకంటే తక్కువ ప్రయాణం చేసినా కూడా ప్రయాణికులు అంతే చార్జీని చెల్లించాలి.

Also Read: మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి మేము సిద్ధంగాలేము.. ఏపీలోనూ ఇక గుజరాత్‌లాగే..: చంద్రబాబు

బేసిక్ చార్జీల్లో మార్పుల్లేవ్
అయితే, బేసిక్ చార్జీల్లో మాత్రం ఏ మార్పులు లేవు. 2026 జనవరికి ముందు పట్టాలెక్కిన అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఉన్న బేసిక్‌ చార్జీలే కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ ఉంటాయి. బేసిక్‌ చార్జీలు అంటే ఎక్స్‌ట్రా చార్జీలు (జీఎస్టీ, రిజర్వేషన్ ఫీ, సూపర్‌ఫాస్ట్‌ చార్జ్‌, ఇతర ఫీజులు) కలపకముందు ఉండే ధర.

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బేసిక్ చార్జీలు స్లీపర్‌ క్లాస్‌కి 200 కి.మీ వరకు రూ.149గా, సెకండ్‌ క్లాస్‌కి రూ.50 కి.మీ వరకు రూ.36గా ఉన్నాయి.

రిజర్వేషన్‌ చార్జీలు, సూపర్‌ఫాస్ట్‌ సర్‌చార్జ్‌ వంటి వాటికి ప్రత్యేకంగా చార్జీలు వేస్తారు. బేసిక్‌ చార్జీలకు వీటిని కలిపి రైల్వే నిబంధనల ప్రకారం ఫైనల్‌ టికెట్‌ ధరను నిర్ణయిస్తారు. మొత్తానికి 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు రూ.500 చార్జీ ఉండొచ్చని తెలుస్తోంది.

ఆర్‌ఏసీ ఉండదు
టికెట్‌ కన్ఫార్మ్‌ అయిన వారికే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఆర్‌ఏసీ (RAC) ఉండదు. అంటే వెయిటింగ్‌ లిస్ట్‌, పాక్షికంగా కన్ఫార్మ్‌ అయిన ప్రయాణికులను అనుమతించరు.

సాధారణంగా రైలు టికెట్‌లో ఆర్‌ఏసీ అంటే పూర్తి కన్ఫర్మ్ బెర్త్ కాకపోయినా, రైల్లో ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఒక బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులు పంచుకోవాలి. ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేస్తే, ఆర్‌ఏసీ టికెట్ కన్ఫర్మ్ బెర్త్‌గా మారే అవకాశం ఉంటుంది.

కానీ, కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మాత్రం ఆర్‌ఏసీ టికెట్లు ఉండవు. రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. స్లీపర్ క్లాస్‌లో మూడు కోటాలు మాత్రమే ఉంటాయి. అవే.. మహిళా కోటా, వికలాంగుల కోటా (పీడబ్ల్యూడీ), సీనియర్ సిటిజన్ కోటా.