Student Died In Classroom : క్లాస్ రూమ్ లో 8వ తరగతి విద్యార్థిని మృతి
గుజరాత్ లోని రాజ్ కోట్ లో విషాదం నెలకొంది. క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిని మృతి చెందారు. ఉదయం స్కూల్ కు వెళ్లిన విద్యార్థిని తరగతి గదిలోనే కుప్పకూలి మరణించారు.
- bheemraj
- Published On : January 19, 2023 / 10:19 PM IST
DIED
Student Died In Classroom : గుజరాత్ లోని రాజ్ కోట్ లో విషాదం నెలకొంది. క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిని మృతి చెందారు. ఉదయం స్కూల్ కు వెళ్లిన విద్యార్థిని తరగతి గదిలోనే కుప్పకూలి మరణించారు. శీతాకాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో 8 డిగ్రీల సెల్సియస్ దిగువన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 14 ఏళ్ల రియా సాగర్ రాజ్ కోట్ లోని గొండాల్ రోడ్ లో ఉన్న ప్రైవేట్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో బాలిక మంగళవారం ఉదయం 7 గంటలకు స్కూల్ కు వెళ్లారు. ప్రేయర్ తర్వాత క్లాస్ రూమ్ కు వెళ్లిన విద్యార్థిని ఉదయం 7.23 గంటలకు కుప్ప కూలింది.
స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని రియా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు విద్యార్థిని తల్లి జానకి బుధవారం మీడియాతో మాట్లాడారు. తీవ్రమైన చలి కారణంగానే తన కుమార్తె చనిపోయినట్లు ఆరోపించారు. రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పేర్కొన్నారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్ కు రప్పిస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డ కట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు తల్లి జానికి తెలిపారు. రియాకు గుండెపోటు రాలేదని, కేవలం తీవ్రమైన చలి వల్ల రక్తం గడ్డ కట్టడంలో మరణించినట్లు పేర్కొంది. అయితే విద్యార్థిని రియా తల్లి వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఆ బాలిక మరణానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందన్నారు.
