CJP Abhijeet Dipke : ఢిల్లీలో సీజేపీ నిరసనలు.. అరెస్ట్ చేయండి.. మేం భయపడం.. విమానంలోనే అభిజీత్ దీప్కే అరెస్ట్..!
Abhijeet Dipke Detain : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకు ముందే హైడ్రామా చోటుచేసుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు మరో ఇద్దరిని విమానం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీజేపీ తీవ్రంగా స్పందించింది.
- Sreehari A
- Updated on- October 10, 2026 / 12:17 PM IST
CJP Abhijeet Dipke
- విమానంలో హైడ్రామా.. అభిజీత్ దీప్కే అదుపులోకి
- ఢిల్లీ చేరుకోగానే సీజేపీ వ్యవస్థాపకుడు నిర్బంధం
- జంతర్ మంతర్ నిరసనకు ముందే బ్రేక్..
- సీజేపీ ఆందోళనకు పోలీసుల అడ్డుకట్ట..
CJP Abhijeet Dipke : దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసనకు ముందే హైడ్రామా నెలకొంది. జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించేందుకు మంబై నుంచి ఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.
విమానం దిగకముందే పోలీసులు లోపలికి రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దీప్కే ఇన్‌స్టాగ్రామ్‌లో (CJP Abhijeet Dipke) లైవ్ పెట్టడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
విమానంలోనే పోలీసులతో వాగ్వాదం :
శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న దీప్కేను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విమానంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో దీప్కేతో పాటు సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది.
పోలీసులు విమానంలోకి రావడంపై సీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయాణికులు దిగే వరకు వేచి ఉండాల్సిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దీప్కే పోలీసులతో మాట్లాడుతూ.. ‘రండి.. మమ్మల్ని అరెస్ట్ చేయండి. మేము భయపడం’ అంటూ వ్యాఖ్యానించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago.
“…I have come here to be arrested; arrest me,” Abhijeet Dipke tells Delhi Police
“No, this is not an arrest. Please cooperate,” Delhi Police personnel tell him.
— ANI (@ANI) October 10, 2026
జంతర్ మంతర్ నిరసనకు ముందే అడ్డుకట్ట :
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనకు నాయకత్వం వహించేందుకు దీప్కే ఢిల్లీకి బయలుదేరారు. అయితే, నిరసనకు అనుమతి కోరడంలో జాప్యం జరిగిందనే కారణంతో ఢిల్లీ పోలీసులు ముందుగానే అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
Read Also : Delhi CJP Protest : ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ నిరసనతో భారీ భద్రత.. మెట్రో స్టేషన్లు బంద్!
అయితే, దీప్కే, దాస్, రాంకాలను అదుపులోకి తీసుకోవడాన్ని సీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతియుత నిరసనలో పాల్గొనకుండా నాయకులను ముందుగానే అడ్డుకున్నారని ఆరోపించింది. వారిని తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు :
నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం యూట్యూబర్ ధ్రువ్ రాథీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్న సింగ్‌లను కూడా వారి ఇళ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రే రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి 400 మందికి పైగా అనుమానిత నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిరసనకారులను అడ్డుకోవడానికి రాజధానిలో 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేసి ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను కాపాడటానికి కేంద్రం పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 20వేల మందికి పైగా సిబ్బందిని మోహరించింది.
