President
President Convoy: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అస్సాం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాష్ట్రపతి కాన్వాయి వాహనశ్రేణిలోని ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. అస్సాంలోని స్థానిక మీడియా సంస్థలు తెలిపిన వివరాలు మేరకు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. తేజ్ పూర్ యూనివర్సిటీ 19వ స్నాతకోత్సవం నిమిత్తం అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చేరుకున్నారు. స్నాతకోత్సవం అనంతరం కుటుంబంతో కలిసి బోకాఖాట్ మీదుగా కజిరంగా నేషనల్ పార్క్ ను, బగోరి పరిధిలోని టైగర్ రిజర్వు పార్కును సందర్శించేందుకు బయలుదేరివెళ్లారు. ఈక్రమంలో జాతీయ రహదారి NH – 37 పై వచ్చే వాహనాలను, ప్రజలను భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతలో వాహనశ్రేణి చివరలో ఉన్న ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి.. రోడ్డుపై నిలుచుని ఉన్న రామేశ్వర్ రబిదాస్ అనే వ్యక్తిని ఢీకొట్టింది.
Also read: Uttar Pradesh Election 2022 : యూపీ ఐదో విడత పోలింగ్ రేపే.. 61 స్థానాలు, 692 మంది అభ్యర్థులు
దీంతో రామేశ్వర్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వాహనశ్రేణిలో వెనువెంటనే ఉన్న మరో రెండు వాహనాలు కూడా రామేశ్వర్ మీదుగా పోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యక్తిని ఢీకొట్టినా.. వాహనాలు ఆపకుండా వెళ్లిపోయాయి. దీంతో స్థానికులు స్పందించి రామేశ్వర్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రామేశ్వర్ మృతి చెందడంతో స్థానిక అధికారుల సూచన మేరకు ఆసుపత్రి సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు. ఇక ఈ విషయంపై వివరాలు తెలపాలంటూ స్థానిక మీడియా ప్రతినిధులు గోలాఘాట్ జిల్లా ఎస్పీని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. తాము రాష్ట్రపతి సెక్యూరిటీ వ్యవహారాల్లో తలమునకలైనట్లు తెలిపారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వెళ్లిన అస్సాం వ్యవసాయ మంత్రి మరియు బోకాఖత్ ఎమ్మెల్యే అతుల్ బోరా.. స్పందిస్తూ.. తనకు కాన్వాయ్ లేదని..రాష్ట్రపతి కాన్వాయిలో ఏ వాహనం ఢీకొట్టిందనే విషయం కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. అయితే మీడియా నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కార్యక్రమం అనంతరం మంత్రి అతుల్ బోరా స్పందిస్తూ రామేశ్వర్ అనే వ్యక్తి.. రాష్ట్రపతి కాన్వాయిలోని సెక్యూరిటీ వాహనం ఢీకొని మృతిచెందాడని ధ్రువీకరించారు. మృతుడి కుటుంబానికి ప్రఘాఢసానుభూతి తెలిపిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈప్రమాదం పై రాష్ట్రపతి కార్యాలయం ఎటువంటి ప్రకటన చేయలేదు.