అసోంలోని సిబ్‌సాగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సోమవారం (సెప్టెంబర్ 23)న డిమోవ్‌లోని నేషనల్ హైవే -37పై ఓ ప్రయివేటు బస్సు.. టెంపో ఢీకొటంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడినవారిని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ప్రమాద తీవ్రత భారీగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
కాగా 2009లో దేశవ్యాప్తంగా 97వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య 2017లో లక్షా 17 వేల 502కు పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య రోజువారీ పెరుగుదలను నివారించడానికి కొత్త మోటారు వాహన చట్టం రూపొందించబడింది. కొత్త మోటారు వాహన చట్టాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నా దీంట్లో ఎటువంటి సడలింపు ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం..టూవీలర్స్ తో రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలతో ప్రమాదాలు 34.8 శాతం ఉండగా..ట్రక్కుల ప్రమాదాలు 11.2 శాతం, కార్లు, టాక్సీలు వంటి వాహనాలు 17.9 శాతం ప్రమాదాలు జరిగాయని తెలుస్తోంది.