రామజన్మభూమి అయోధ్య రామాలయం నిర్మాణంలో వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ కూడా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో నిర్మిస్తామంటూ హిందూ మహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తే అయోధ్యలో రామాలయాన్ని రాళ్లు, ఇటుకలతో కాకుండా బంగారంతో పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తామని స్వామి చక్రపాణి వ్యాఖ్యానించారు. నవంబరు నెలలో అయోధ్య విషయంలో తీర్పు హిందూమహాసభకు, హిందువులకు అనుకూలంగానే వస్తుందని చక్రపాణి భావిస్తున్న చక్రపాణి ఈ వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మానికి చెందిన హిందువులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని..వారంతా రామాలయాన్ని బంగారంతో నిర్మించేందుకు భారీగా విరాళాలిస్తారని అన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో వాదనలను అక్టోబరు 18తో ముగుస్తాయని సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వామి చక్రపాణి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.