Insect In Food: వందే భారత్ రైలులో దారుణం.. ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో పురుగు

ఈ ఘటనపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెంటనే స్పందించింది. వెండర్ కు రూ. 10 లక్షల భారీ జరిమానాతో పాటు కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసింది.

  • Published On : April 7, 2026 / 06:07 PM IST

 

 

Insect In Food: వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు సరఫరా చేసే ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వందే భారత్ రైలులో దారుణం జరిగింది. ఓ ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో పరుగు కనిపించింది. దీంతో అతడు షాక్ కి గురయ్యాడు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ఈ ఘటన జరిగింది. ఆహారంలో పురుగు కనిపించడంపై ఆ ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను దాల్ చావల్ ఆర్డర్ చేశానని, అందులో బొద్దింక లాంటి కీటకం కనిపించిందన్నాడు. దీన్ని అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కోచ్‌లో ఇలాంటివి కనీసం రెండు ఘటనలు జరిగాయని, దీంతో అందరూ భోజనం చేయడం ఆపేశారని అతడు వాపోయాడు. ఆహార విక్రేత ఆర్కే గ్రూప్‌లో భాగమైన ఎం/ఎస్ బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అని ప్రయాణికుడు వెల్లడించాడు.

దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రయాణికులు ఆహార సరఫరా సంస్థ ‘బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్’పై వెంటనే తనిఖీలు చేసి లైసెన్స్ రద్దు చేయాలని రైల్వే శాఖను డిమాండ్ చేశారు. “ఆహారాన్ని FSSAI ప్రమాణాల ప్రకారం తయారు చేయడం లేదని నాకు కచ్చితంగా తెలుసు. దోషులుగా తేలితే, వారి లైసెన్సును రద్దు చేయాలి. ఈ విషయం లంచాలతో పరిష్కారం కాదని ఆశిస్తున్నా” అని ఆ ప్రయాణికుడు తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

ఈ ఘటనపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెంటనే స్పందించింది. “సేవా సంస్థకు రూ. 10 లక్షల భారీ జరిమానాతో పాటు కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేస్తున్నాము” అని తెలిపింది. “లోతైన శుభ్రత, కీటక నియంత్రణ కోసం వంటగదిని సీల్ చేశాము” అని కూడా వెల్లడించింది. “కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాము. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాము,” అని IRCTC తెలిపింది. “పరిశుభ్రత , ప్రయాణికుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత” అని తేల్చి చెప్పింది.

ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “నేను ఎప్పుడూ నా ఆహారాన్ని నేనే తీసుకువెళ్తాను. ప్రయాణ సమయం ఎక్కువైతే, యాప్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడతాను” అని ఒక వినియోగదారుడు తెలిపాడు. “ఇలాంటి ఘటనలు ఇటీవల అనేకం జరిగాయి. అయినా మార్పు లేదు. అదే నిర్లక్ష్యం. ఇది తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారుతుంది. పదేపదే క్షమాపణలు కోరేకంటే మెరుగైన సేవ అందించాలి” అని మరొక నెటిజన్ స్పందించాడు. “నేను రైలు టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ‘ఆహారం వద్దు’ అనే ఆప్షన్ ను ఎప్పుడూ ఎంచుకుంటాను. నా ఆహారాన్ని నేనే తీసుకెళ్తాను” అని మరో యూజర్ అన్నాడు. “దయచేసి మీ ఆహారాన్ని మీతో తీసుకువెళ్ళండి. శుభ్రమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరఫరా చేస్తారని ఏ విక్రేతను నమ్మొద్దు. ఎవరూ నమ్మదగినవారు కాదు, నాణ్యత నియంత్రణ కూడా లేదు” అని యూజర్ రైలు ప్రయాణికులకు సూచించాడు.

 

Also Read: బిర్యానీ లవర్స్‌కు బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా ? ఒక్కసారి ఇది చూడండి..