Bangladesh Garment Crisis : బంగ్లాదేశ్‌లో నిరసనలు.. మీ బట్టల రేట్లు పెరగనున్నాయ్.. దానికి, దీనికి లింక్ ఇదే..
Bangladesh Garment Crisis : బంగ్లాదేశ్‌లో వస్త్ర కార్మికుల ఆందోళనలు.. భారతదేశంకు కలిసొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు భారత వస్త్ర పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- Harish Thanniru
- Published on- November 16, 2026 / 07:17 PM IST
Bangladesh Garment Crisis
Bangladesh Garment Industry Impact on India : బంగ్లాదేశ్‌లోని ప్రధాన వస్త్ర తయారీ కేంద్రాల్లో మెరుగైన కనీస వేతనం కోసం కార్మికులు సమ్మెకు దిగడంతో డజన్ల కొద్దీ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వారాంతంలో దేశవ్యాప్తంగా దాదాపు 150 ఫ్యాక్టరీలను మూసివేశారు. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు కేంద్రాలైన సావర్, అషులియా, గాజీపూర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అక్కడ రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే.. భారత దేశంలో పలు రకాల రెడీమేడ్ దుస్తుల ధరల భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బంగ్లాదేశ్‌కు వస్త్ర పరిశ్రమ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ప్రతీయేటా దాదాపు రూ. 3.7లక్షల కోట్లు విలువైన ఎగుమతులు ఈ రంగం ద్వారా జరుగుతున్నాయి. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 10శాతం వాటా ఈ పరిశ్రమదే కావటం గమనార్హం. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో దాదాపు 40 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. హెచ్ అండ్ ఎం, ప్రైమార్క్, జారా వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కోసం వీరు దుస్తులు తయారు చేస్తున్నారు. చైనా తర్వాత ప్రపంచంలోనే రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది.
ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు నెలకు కనీస వేతనాన్ని 30వేల టాకాలకు (రూ. 22,600) పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలవారీ కనీస వేతనం 12,500 టాకాలుగా ఉంది. కార్మికుల ఆందోళనలతో పలు ప్రధాన పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. దాదాపు 700 ఫ్యాక్టరీలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుత ఆందోళనలు ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ కొనుగోలుదారులపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
హెచ్ అండ్ ఎమ్, జారా, వాల్‌మార్ట్, లెవీస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు ఎక్కువగా బంగ్లాదేశ్‌లోనే తయారవుతాయి. ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల సకాలంలో సరుకు రవాణా నిలిచిపోయింది. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్టు సరుకు లేకపోతే ధరలు సహజంగానే పెరుగుతాయి. దీంతో ప్రత్యామ్నాయంగా వేరే దేశాల నుంచి ఉత్పత్తి చేయించుకోవాల్సి వస్తే రవాణా, తయారీ ఖర్చులు పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే దుస్తుల ధరలు తప్పనిసరిగా పెరుగుతాయని చెప్పలేం. ఇతర దేశాల నుంచి సరఫరా పెరగడం, కంపెనీలు అదనపు ఖర్చులను భరించడం వంటి అంశాలపై కూడా ధరలు ఆధారపడి ఉంటాయి.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. బంగ్లాదేశ్ లో వస్త్ర కార్మికుల ఆందోళనలు.. భారతదేశంకు కలిసొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు భారత వస్త్ర పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఆర్డర్లను ఇతర దేశాలకు మళ్లిస్తే భారత తయారీ సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి కొన్ని ఆర్డర్లు భారత్, పాకిస్థాన్ వంటి దేశాలకు మళ్లుతున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లో ఇప్పటికే విస్తృతమైన వస్త్ర తయారీ వ్యవస్థ అందుబాటులో ఉంది. పత్తి, నూలు, వస్త్ర తయారీ నుంచి దుస్తుల రూపకల్పన, కుట్టు, ఎగుమతుల వరకు అనేక విభాగాల్లో పరిశ్రమలు పనిచేస్తున్నాయి. టీషర్టులు, స్వెట్‌షర్టులు, డెనిమ్, చిన్నపిల్లల దుస్తులు, మహిళల వస్త్రాలు వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది.
