×
Ad

Bayya Sunny Yadav: NIA అదుపులో ప్రముఖ తెలుగు యూట్యూబర్.. పాకిస్తాన్ నుంచి ఇండియా రాగానే అరెస్ట్..

జ్యోతితో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే యాంగిల్ లోనూ ఎన్ఐఏ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు NIA అధికారులు. భయ్యా సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ కు బైక్ పై వెళ్లి వచ్చాడు. పాక్ టూర్ కు సంబంధించిన వివరాలపై అతడిని ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

కాగా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా పోలీసులు లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్‌ పోలీస్ స్టేషన్‌లో యాదవ్‌పై కేసు నమోదైంది. పోలీసులు సన్నీ యాదవ్ కోసం గాలించారు. అయితే అతడు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సన్నీ యాదవ్‌ వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్‌ కి వెళ్లినట్లు పోలీసులు అనుమానించారు. పాకిస్తాన్ బైక్ టూర్‌ను పూర్తి చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సన్నీ యాదవ్ తిరిగి ఇండియాకు రాగా, చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో చేసిన ఫిర్యాదుతో భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సన్నీ యాదవ్ సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నాడని ఆయన ఆరోపించారు. అమాయకులను తప్పుదోవ పట్టించి, యువత జీవితాలను నాశనం చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు సజ్జనార్.

అంతర్జాతీయ బైక్ రైడర్ గా గుర్తింపు పొందిన సన్నీ.. ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడన్న ఆరోపణలు ఉన్నాయి. యువతను పెడదోవ పట్టించేలా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను అతడు ప్రమోట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Also Read: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్టు

తాజాగా.. సన్నీ యాదవ్ అరెస్ట్ కు ప్రధాన కారణాం.. ఇటీవల అతడి పాకిస్తాన్ బైక్ టూర్ అని తెలుస్తోంది. బైక్ టూర్ ముగించుకుని పాకిస్తాన్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు అతను స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే అలర్ట్ అయిన ఎన్ఐఏ అధికారులు.. చెన్నై ఎయిర్ పోర్టులో సన్నీని అదుపులోకి తీసుకున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇదే సమయంలో మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం పని చేస్తున్న దేశద్రోహులు కొందరు పట్టుబడిన సంగతి తెలిసిందే. యూట్యూబర్ ముసుగులో హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా భారత్ కు చెందిన కీలక, రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. గూఢచర్యం కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గూఢచర్యం ఆరోపణలతో మరికొందరిని కూడా నిఘా వర్గాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ లో పర్యటనలు చేస్తున్న వారిపై అధికారుల నిఘా పెట్టారు.

పాకిస్తాన్‌కు వెళ్లే వారిపై, అక్కడి అధికారులు లేదా పౌరులతో సంబంధాలు జరిపే వారిపై గట్టి నిఘా ఉంచారు. పాక్ నిఘా వర్గాలకు భారత్ కు చెందిన కీలక సమాచారం చేరవేశారనే అనుమానంతో యూట్యూబర్ జ్యోతిని పోలీసులు విచారిస్తున్నారు. ఇదే కోణంలో సన్నీ యాదవ్‌ను కూడా NIA అధికారులు విచారించనున్నారని సమాచారం. అంతేకాదు.. జ్యోతితో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే యాంగిల్ లోనూ ఎన్ఐఏ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.