Bhopal: జగపతి బాబు, ఆమని, రోజా నటించిన “శుభలగ్నం” సినిమా 1994లో విడుదలైంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో జగపతి బాబు, ఆమనికి పెళ్లి జరుగుతుంది.
కొన్నేళ్లకు జగపతి బాబును రోజా ప్రేమిస్తుంది. అతడు పెళ్లయిన వాడని తెలిసినా అతడి ప్రేమలో పడుతుంది. చివరకు ఆమనితో మాట్లాడి ఆమెకు రూ.కోటి ఇచ్చి జగపతి బాబుని రోజా పెళ్లి చేసుకుంటుంది.
ఇటువంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటుచేసుకుంది. తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆయనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ నుంచి రూ.కోటిన్నర తీసుకుంది.
Also Read: రేపు కొలువుదీరనున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఇక యూనస్ దారెటు? ఆయన సలహాదారుగా ఉన్న సమయంలో రచ్చ రచ్చ
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ మాట్లాడుతూ.. “నా భర్త మరో మహిళ మోజులో పడ్డాడు. అప్పటి నుంచి మా కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. నేను, పిల్లలు నలిగిపోతున్నాం” అని చెప్పింది.
ఆమె భర్తకు 52 ఏళ్లు. అతడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. అతడు పనిచేసే డిపార్ట్‌మెంట్‌లోని మరో ఉద్యోగిని (54)తో డేటింగ్‌లో ఉంటున్నాడు. దీంతో అతడి భార్య విడాకుల కోసం కోర్టుకు వెళ్లింది. తన భర్తతో తిరిగిన మహిళ నుంచి రూ.కోటిన్నర తీసుకుని, సెటిల్‌మెంట్ చేసుకుని విడాకుల పేపర్లపై సంతకాలు చేసింది.