Commercial LPG: బిగ్ రిలీఫ్.. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం

ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తామని చెప్పింది కేంద్రం. రెస్టారెంట్లు, హోటళ్లు, డాబాలలో గ్యాస్ కొరత లేకుండా చూడాలని సూచించింది.

  • Published On : March 21, 2026 / 07:56 PM IST
  • హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం రిలీఫ్
  • రాష్ట్రాలకు అదనంగా 20శాతం కమర్షియల్ గ్యాస్
  • హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలన్న కేంద్రం

Commercial LPG: గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది కేంద్రం. అంతేకాదు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను 20శాతానికి పెంచుతున్నట్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక ఎల్లుండి (మార్చి 23) నుంచి సిలిండర్లు పంపిస్తామని చెప్పింది కేంద్రం. ఇటీవల కేంద్రం ప్రకటించిన 10శాతం గ్యాస్ కు ఇది అదనం. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం.

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచ దేశాలకు ఇబ్బందిగా మారింది. పలు దేశాలు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో భారత్ లోనూ గ్యాస్ సప్లయ్ పై ప్రభావం పడింది. ఈ క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం షరతులు విధించాల్సి వచ్చింది. గృహ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై షరతులతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని చోట్ల గ్యాస్ లేక హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సి పరిస్థితులు వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను 20శాతానికి పెంచుతున్నట్లుగా ప్రకటించింది. మార్చి 23 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

తాజా పెంపుతో రాష్ట్రాలకు అందే గ్యాస్ కోటా 50 శాతానికి చేరుకుంటుంది. అదనంగా కేటాయించిన 20 శాతం గ్యాస్‌ వినియోగంలో కచ్చితమైన ప్రాధాన్యతలను కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా సామాన్యుల ఆహార అవసరాలకు లోటు లేకుండా ఉండేలా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పింది.

ఇక ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రాయితీతో నిర్వహించే క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, వలస కార్మికులకు ఉద్దేశించిన 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను కచ్చితంగా సరఫరా చేయాలంది. అంతేకాదు ఈ అదనపు కోటా దుర్వినియోగం అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని తేల్చి చెప్పింది కేంద్రం.

Also Read: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బాబోయ్.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. లీటర్ ధర ఏకంగా రూ. 22 పెంపు..!