Raghav Chadha: ఎంపీ రాఘవ్ చద్దాకు బిగ్ షాక్ ఇచ్చిన ఆప్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు

చద్దా తొలగింపు నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఆప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, దీని వెనుక కారణం ఏమై ఉండొచ్చు అని ఆరా తీస్తున్నారు.

  • Published On : April 2, 2026 / 04:50 PM IST
  • రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చద్దా తొలగింపు
  • కొత్తగా అశోక్ మిట్టల్ కు బాధ్యతలు
  • కొంతకాలంగా పార్టీ, చద్దాకు మధ్య విభేదాలు

Raghav Chadha: ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ (పంజాబ్)ను నియమించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. అంతేకాదు పార్లమెంటులో మాట్లాడేందుకు చద్దాకు సమయం ఇవ్వొద్దని కూడా కోరింది. ఈ పరిణామం ఆప్ లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి కాలంలో రాఘవ్ చద్దా జనాల్లో బాగా పాపులర్ అయ్యారు. పార్లమెంటులో వరుసగా ప్రజా సమస్యలను లేవనెత్తుతూ వార్తల్లో నిలిచారు.

అశోక్ కుమార్ మిట్టల్ రాజ్యసభలో తమ ఆద్మీ పార్టీ కొత్త డిప్యూటీ లీడర్‌గా నియమితులవుతున్నారని, ఈ నిర్ణయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌కు తెలియజేసినట్లు ఆప్ తెలిపింది. ఆ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించాలన్న పార్టీ అభ్యర్థన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పంజాబ్ రాజ్యసభ ఎంపీ అయిన మిట్టల్ ఆ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఏడుగురు పంజాబ్ నుండి, ముగ్గురు ఢిల్లీ నుండి ఉన్నారు.

పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు..

పార్టీ జాతీయ కన్వీనర్ తనకు రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పాత్రను అప్పగించారని, తాను తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, సభలో పార్టీ వైఖరిని, జాతీయ ప్రయోజనాలను బలంగా వినిపిస్తానని మిట్టల్ తెలిపారు. సడెన్ గా చద్దాను బాధ్యతల నుంచి ఆప్ తప్పించడం సంచలనంగా మారింది. పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ కు దారితీసింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

కాగా, ఈ మార్పును తక్కువ చేసి చూపారు మిట్టల్. ఇదొక సాధారణ ప్రక్రియగా అభివర్ణించారు. గతంలో ఎన్.డి. గుప్తా రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడిగా ఉండేవారని, ఆ తర్వాత చద్దాకు ఆ బాధ్యత అప్పగించారని ఆయన గుర్తు చేశారు.

“ఇప్పుడు ఈ పాత్రను నాకు అప్పగించారు. ఎంపీలందరూ నేర్చుకోవాలని మా పార్టీ కోరుకుంటుంది. బహుశా ఆ నేపథ్యంలోనే రాజకీయాల్లోని ప్రక్రియలు, పరిపాలనా నైపుణ్యాలు నేర్చుకునేందుకు నాకీ పాత్ర ఇచ్చారేమో” అని మిట్టల్ అన్నారు. అంతేకాదు పార్టీ బలంగానే ఉందని కూడా స్పష్టం చేశారు.

మిట్టల్ ఏప్రిల్ 2022లో సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుండి రక్షణ కమిటీ, ఆర్థిక కమిటీతో సహా పలు పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. ఫిబ్రవరి 2026లో ఆయనను భారత్-అమెరికా పార్లమెంటరీ స్నేహ బృందంలో సభ్యునిగా నియమించారు. గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రష్యా, లాట్వియా, స్లోవేనియా, గ్రీస్, స్పెయిన్‌లలో పర్యటించిన డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు.

కీలక అంశాలపై చద్దా మౌనం..

చద్దా తొలగింపు నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఆప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, దీని వెనుక కారణం ఏమై ఉండొచ్చు అని ఆరా తీస్తున్నారు. కాగా, ఆప్‌కు సంబంధించిన విషయాలపై చద్దా సుదీర్ఘకాలంగా మౌనం వహించడం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పలు బహిరంగ కార్యక్రమాలకు ఆయన గైర్హాజరు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ చర్య చోటు చేసుకుంది.

వాస్తవానికి ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా, దేశంలోనే అతి పిన్న వయస్కులైన ఎంపీలలో ఒకరిగా పరిగణించబడ్డారు రాఘవ్ చద్దా. ఆప్ పార్టీ వ్యవహారాలలో ముఖ్యంగా పంజాబ్‌, ఢిల్లీలో ఆప్ హయాంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఇటీవలి కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2024 మార్చిలో ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు వైద్య కారణాల నిమిత్తం రాఘవ్ చద్దా విదేశాల్లో ఉన్నారు. కేజ్రీవాల్ దాదాపు ఆరు నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆయన దూరంగానే ఉన్నారు. 2024 సెప్టెంబర్ 13న ఆయన విడుదలైన కొద్ది రోజులకే కలిశారు.

ఇక గత నెలలో ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నాయకులను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించినప్పుడు సైతం రాఘవ్ చద్దా మౌనం వహించారు. కోర్టు ఉపశమనం కల్పించిన తర్వాత కేజ్రీవాల్ నిర్వహించిన మీడియా సమావేశానికి, జంతర్ మంతర్ వద్ద జరిగిన ర్యాలీకి కూడా ఆయన హాజరు కాలేదు.

అధిక విమాన ఛార్జీలు, గిగ్ వర్కర్ల దుస్థితి వంటి సమస్యలపై పార్లమెంటు లోపల, వెలుపల చద్దా తన వాయిస్ వినిపించారు. అయితే, రాష్ట్రాల్లోని ఆప్ రాజకీయ ప్రచారాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాల నుంచి ఆయనను క్రమంగా పక్కన పెడుతూ వచ్చారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.

Also Read: సామాన్యులకు అలర్ట్.. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర కీలక ప్రకటన..