×
Ad

Nishant Kumar : బీహార్ రాజకీయాల్లోకి సీఎం నితీశ్ కొడుకు నిశాంత్ కుమార్..? ఆయన ఎంట్రీ ఎప్పుడంటే..

Nitish Kumar Son Nishant Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైందా..?

Nishant Kumar

Nitish Kumar Son Nishant Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? జేడీయూలో ఆయన క్రియాశీలకంగా మారబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నితీశ్ కుమార్‌కు సన్నిహితుడు సంజయ్ కుమార్ ఝూ వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి.

నిశాంత్ కుమార్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని జేడీయూ నాయకులు, కార్యకర్తల నుంచి ఎప్పుటి నుంచో డిమాండ్ ఉంది. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిశాంత్ కుమార్ రాజకీయ రంగప్రవేశం చేయాలన్న డిమాండ్ పెరిగింది. దీంతో ఆయన నలందలోని ఒక స్థానం నుంచి పోటీ చేయొచ్చునని చాలా మంది భావించారు. కానీ, ఆ ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయలేదు. నిశాంత్ ను పోటీకి దింపకుండానే జేడీయు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా, నిశాంత్ రాజకీయ ప్రవేశం గురించి పార్టీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

నిశాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని, పార్టీలో ప్రధాన బాధ్యతలను స్వీకరించడాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు జేడీయు నాయకత్వం పదేపదే చెబుతోంది. అయితే, తుది నిర్ణయం ఆయన తండ్రి, సీఎం నితీశ్ కుమార్‌దే. తాజాగా.. శుక్రవారం పాట్నా విమానాశ్రయంలో ఒక కీలక పరిణామం జరిగింది.

విమానాశ్రయంలో నిశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో.. ఆయన పక్కనే నిలబడి ఉన్న సంజయ్ కుమార్ ఝూ విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి బహిరంగ మద్దతు ఇచ్చారు. ‘పార్టీ సభ్యులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు అందరూ నిశాంత్ కుమార్ పార్టీలో చేరాలని, పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారు. మేమంతా అదే కోరుకుంటున్నాం. కానీ, పార్టీలో బాధ్యతలు ఎప్పుడు చేపడతాడనే విషయం అతను నిర్ణయించుకోవాలి’ అంటూ సంజయ్ కుమార్ ఝూ అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న నిశాంత్ కుమార్ సంజయ్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన తెలియజేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అంతకుముందు నిశాంత్ కుమార్ ఎన్డీయే-జేడీయూ అఖండ విజయంపై మాట్లాడుతూ.. ఇది బీహార్ ప్రజల ఆశీర్వాదమని అన్నారు. తన తండ్రి నితీశ్ కుమార్ పై , ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని పేర్కొన్నారు. ‘నా తండ్రి నితీశ్ కుమార్ మునుపటి వాగ్దానాలను నెరవేర్చాడు. ఈసారి కూడా కోటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సృష్టిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు’ అని నిశాంత్ కుమార్ అన్నారు.