Bihar: ‘‘ నా వయస్సు 55 ఏళ్లు.. నేను చాలా పేదవాడిని నేను కోటీశ్వరుడ్ని కావాలని కోరిక ఉంది..అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా..దయచేసి నాకు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేను చేసి కోటీశ్వరుడ్ని అయ్యే అవకాశాన్ని ఇవ్వండి..కోటీశ్వరుడ్ని కావటానికే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ ఎమ్మెల్యే అభ్యర్థి వ్యాఖ్యానాలు వింటే ఎవ్వరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఇదేంటీ నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అది చేస్తాను…ఇది చేస్తాను అనే అభ్యర్థుల్ని చూశాంగానీ..ఈయనేంటీ తాను కోటీశ్వరుడు కావటానికి ఎన్నికల్లో పోటీచేస్తున్నాననీ ఇంత బహిరంగంగా చెప్పేస్తున్నాడని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు. స్థానికులే కాదు ఇది విన్న ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే. ఇటువంటి ఎన్నికల చిత్రాలకు బీహార్ రాష్ట్రం వేదిక అయ్యింది.
బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీనికి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు ఎన్నికల సిత్రాలు మొదలుపెట్టేశారు. దీంట్లో భాగంగానే..నలందా జిల్లాలోని బర్బీఘా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..తాను కోటీశ్వరుడిని అయ్యేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని స్పష్టంగా చెప్పేశారు. దర్జీగా పనిచేస్తూ ఇంకా పేదరికాన్నే గడుపుతున్నానని, కోటీశ్వరుడిని కావాలనే తన కోరిక తాను ఎంత కష్టపడినా నెరవేరలేదని..అందుకే రాజకీయాల్లోకి వచ్చి కోటీశ్వరుడు అవ్వాలనే కల నిజం చేసుకోవాలని అనుకుంటున్నానని ఓపెన్ గా చెప్పేశారు రాజేంద్రప్రసాద్.
ఎమ్మెల్యేగా గెలిచిన వారంతా చూస్తుండగానే కోటీశ్వరులు..మిలియనీర్లు..బియనీయర్లు..అయిపోయి అత్యంత ఖరీదైన భవనాలు, లగ్జర్ కార్లు కొంటున్నారన్నారని..ఇతంతా రాజకీయాల్లోకి రావటం వల్లనేనని రాజకీయాల గుట్టును బైటపెట్టారు రాజేంద్ర ప్రసాద్. వారిలాగానే నేను కూడా శ్రీమంతుడ్ని కావాలనే రాజకీయాల్లోకి వచ్చాననీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననీ తెలిపారు.
అభివృద్ధి పనుల పేరిట నియోజకవర్గానికి వచ్చే నిధులను మాయం చేసి డబ్బులు కూడబెడతానని కూడా కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేసరికి మీడియా కూడా నోరెళ్లబెట్టింది. కాగా..రాజేంద్రప్రసాద్ పై ఓ భూవివాదం, అత్యాచారం కేసు ఉన్నాయని స్వయంగా ఆయనే చెప్పటం మరో విశేషం.
రాజకీయాల్లోకి రావాలంటే ఇటువంటివి ఉండాల్సిందేనని..బికారి కూడా రాజకీయాల్లోకి వస్తే కోటీశ్వరులైపోతారని అందుకే తాను కూడా బట్టలు కుట్టుకుంటు ఇప్పటి వరకూ చాలా కష్టపడ్డాను..ఇక నా వల్ల కాదు ఇలాగైతేనే నేను కోటీశ్వరుడ్నీ అవ్వటం కుదరదు..అందుకే ఎమ్మెల్యేనై కోటీశ్వరుడ్నైపోతా..కాబట్టి నాకు ఓట్లు వేసి నన్ను కోటీశ్వరుడ్ని చేయండి అంటూ కోరుతున్నాడు రాజేంద్రప్రసాద్.బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ చిత్రవిచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.