Bihar Woman Assault : బీహార్ లో మరో దారుణ ఘటన.. టూరిస్ట్ స్పాట్‌లో యువతికి వేధింపులు.. చెప్పులతో దాడి..
Bihar Woman Assault : బిహార్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి, చెప్పులతో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
- Harish Thanniru
- Published on- September 25, 2026 / 02:34 PM IST
Bihar
Bihar Woman Assault : బిహార్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి, చెప్పులతో దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : Air India Pilot Suspended : జ్యూరిచ్‌లో ఎయిర్ ఇండియా పైలట్‌కు షాక్.. టెస్ట్‌లో ఫెయిల్.. వెంటనే సస్పెన్షన్!
బిహార్‌లోని బాంకా జిల్లాలో ఉన్న మందర్ హిల్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించారు. ఆమెపై చెప్పులతో దాడి చేసినట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై సెప్టెంబర్ 3 తేదీ కనిపిస్తున్నప్పటికీ, పోలీసుల దృష్టికి మాత్రం సెప్టెంబర్ 22న వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసు బృందం మందార్ హిల్‌కు వెళ్లి వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించింది. అది మందార్ హిల్ ప్రాంతమేనని నిర్ధారించింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక గ్రామస్తులు, దుకాణదారులను విచారిస్తూ వీడియోలో కనిపిస్తున్న యువకులు, బాధితురాలి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల ఆచూకీ లభించలేదు. నిందితులను గుర్తించిన తర్వాత చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇటీవల జాముయి జిల్లాలో స్నేహితులైన ఇద్దరు టీనేజర్లు.. కోచింగ్ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డుపైనే దుండగులు అడ్డగించిన సంగతి తెలిసిందే. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన మరవక ముందే సమస్తీపుర్ జిల్లాలోనూ ఓ టీనేజీ అమ్మాయి, అబ్బాయి కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు తీసుకుంటుండగా కొందరు ఆకతాయిలు అడ్డగించి అమానుషంగా ప్రవర్తించారు. ఇలా వరుస ఘటనలు బిహార్‌లో రాజకీయ దుమారం రేపాయి. తాజాగా మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
