UP Rajya Sabha Elections: యూపీ రాజ్యసభ పోరు.. 8 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్ర మంత్రులకు షాక్
ఉత్తరప్రదేశ్ ద్వైవార్షిక ఎన్నికల(UP Rajya Sabha Elections) కోసం బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది .
- V Santhosh Kumar
- Published on- October 5, 2026 / 05:31 PM IST
BJP announces 8 candidates for UP Rajya Sabha elections.
UP Rajya Sabha Elections: ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లకు అవకాశం లభించింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులైన హర్దీప్ సింగ్ పూరీ, బీఎల్ వర్మలకు పార్టీ ఈసారి మళ్లీ చోటు కల్పించలేదు. వారి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో సరికొత్త సమీకరణాలతో బీజేపీ నాయకత్వం కొత్త ముఖాలను బరిలోకి దింపింది.
అక్టోబర్ 16న పోలింగ్.. ముమ్మరంగా నామినేషన్లు:
ఈ రాజ్యసభ ఎన్నికలకు(UP Rajya Sabha Elections) సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి అక్టోబర్ 6 ఆఖరి తేదీ కాగా, అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. బీజేపీ ఎనిమిది మందిని ఖరారు చేయగా, విపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఇప్పటికే రామ్ గోపాల్ యాదవ్, ధన్‌రాజ్ నత్వానీలను తమ అభ్యర్థులుగా ప్రకటించింది. అంతేకాకుండా మూడో అభ్యర్థిని కూడా రంగంలోకి దించేందుకు ఎస్పీ సమాయత్తమవుతోంది. అసెంబ్లీలో ప్రతిపాదిత బలం ప్రకారం బీజేపీకి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పటికీ, ఎనిమిదో స్థానం విజయం కోసం ఎన్‌డీఏ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది.
ఎన్డీయే అసెంబ్లీ బలం.. ఎనిమిదో సీటుపై ఉత్కంఠ:
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎన్‌డీఏ కూటమికి 289 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఇందులో బీజేపీకి 256, అప్నా దళ్ (ఎస్)కు 13, ఆర్‌ఎల్‌డీకి 9, ఎస్‌బీఎస్‌పీకి 6, నిషాద్ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి. వీరికి తోడు ఇద్దరు జనసత్తా దళ్ (లోక్‌తాంత్రిక్) ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా దక్కే సూచనలు కనిపిస్తుండటంతో ఎన్‌డీయే బలం 294కి చేరుతుంది. ఈ సమీకరణాల ప్రకారం బీజేపీ ఎనిమిది స్థానాలనూ సునాయాసంగా గెలుచుకోవడానికి కేవలం రెండు ఓట్ల కొరత మాత్రమే ఉంది. దీంతో చివరి నిమిషంలో క్రాస్ ఓటింగ్ లేదా ఇతర పార్టీల మద్దతుపై ఉత్కంఠ నెలకొంది.
