Kalita Majhi MLA: నాడు పని మనిషి.. నేడు ఎమ్మెల్యే.. ఏకంగా 12వేల మెజార్టీ.. ఎవరీ కలితా మాఝీ.. ఎమ్మెల్యే సీటు ఎలా దక్కింది..
Kalita Majhi : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక సాధారణ కార్మికురాలు కలితా మాఝీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ప్రజలు కొనియాడుతున్నారు.
- Harish Thanniru
- Updated on- May 5, 2026 / 11:51 AM IST
Bjp Candidate Kalita Majhi Wins In West Bengal
- పని మనిషి నుంచి ఎమ్మెల్యేగా
- 12వేలకుపైగా ఓట్ల మెజార్టీతో కలితా మాఝీ విజయం
- వచ్చిన మొత్తం ఓట్లు 1,07,692
Kalita Majhi : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టింది. 15ఏళ్ల తృణమూల్ పాలనకు తెరపడింది. ఈ ఎన్నికల ఫలితాల్లో అనేక సంచనాలు నమోదయ్యాయి. అందులో కలితా మాఝీ (Kalita Majh) విజయం కూడా ఉంది. ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ నెలలోకొద్దిగా వచ్చే జీతంతో జీవనం సాగిస్తున్న కలితా.. ఇప్పుడే ఎమ్మెల్యేగా విజయం సాధించింది.. ఏకంగా 12వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఔస్‌గ్రామ్ (Ausgram) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 37ఏళ్ల కలితా మాఝీ పోటీ చేసింది. మొత్తం 1,07,692 ఓట్లు సాధించిన ఆమె.. తన ప్రత్యర్థి శ్యామా ప్రసన్న లోహర్‌ను 12,535 ఓట్ల తేడాతో ఓడించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసింది. అయితే, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన అభేదానంద థాండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో కలితా మాఝీ ఓడిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ బీజేపీ ఆమెను బరిలోకి దింపగా.. స్థానిక ప్రజల మద్దతుతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.. తద్వారా కలితా తన కలను నిజం చేసుకుంది.
కలితా మాఝీ భర్త (ప్లంబర్), ఒక కుమారుడు ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇళ్లలో పాచిపని చేస్తూ అతి సాధారణ జీవనం సాగిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కావటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పేదరికం నుంచి వచ్చి, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ.. క్షేత్ర స్థాయి నుండి ఎదిగిన నాయకురాలిగా బీజేపీ ఆమెను గుర్తించి.. గతంలో ఓడిపోయిన స్థానం నుంచి మళ్లీ బరిలో నిలిపింది.. ప్రస్తుతం ఆమె విజయం సాధించింది. MLA అభ్యర్థిగా ప్రకటించినా పలు ఇండ్లలో పనులు చేసుకుంటూనే ప్రచారం చేసి గెలుపొందడం విశేషం.
కలిత బావ కార్తీక్ బాగ్ 2006లో ఇదే నియోజకవర్గం నుండి సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆ కుటుంబంతో వీరికి ఎటువంటి సంబంధం లేదు. అయితే, ఒక సాధారణ కార్మికురాలు ప్రజా ప్రతినిధిగా విజయం సాధించడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.
ఇదిలాఉంటే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 293 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 206 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. తృణమూల్ 81 స్థానాల్లో, కాంగ్రెస్ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. తొలిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
