Blue Micro Moon : ఈనెల 31న ఆకాశంలో అద్భుత దృశ్యం.. భూమికి దూరంగా, చిన్నగా చంద్రుడు.. ఏ సమయంలో చూడొచ్చు అంటే..
Blue Micro Moon : ఈనెల 31న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.
- Harish Thanniru
- Updated on- May 29, 2026 / 09:53 AM IST
Blue Micro Moon
Blue Micro Moon : ఈనెల 31న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. బ్లూ మైక్రోమూన్ ఏర్పడనుంది. రాత్రివేళ చంద్రుడు భూమికి దూరంగా, చిన్నగా కనిపించనున్నాడు.
ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే బ్లూమూన్ అని, భూమికి అత్యంత దూరంగా చంద్రుడు వెళ్తే మైక్రో మూన్ అని పిలుస్తారు. ఈ రెండు సంఘటనలు ఒకేరోజున సంభవించనున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ సమయంలో చంద్రుడు భూమికి 2,52,360 మైళ్ల దూరంలో ఉంటాడు. అప్పుడు చంద్రుడు 6శాతం చిన్నగా.. 10శాతం తక్కువ కాంతితో కనిపిస్తాడు.
చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత దూరంలో ఉన్న బిదువైన అపోజీకి సమీపంలో పౌర్ణమి దశకు చేరుకున్నప్పుడు మైక్రో మూన్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ కాలమానం ప్రకారం.. మే 31, రాత్రి 8:45 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం జూన్ 1 తెల్లవారుజామున) ఈ బ్లూ మూన్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మే 31 రాత్రి నుంచే భారతీయులు ఈ బ్లూ మూన్‌ను చూడవచ్చు.
2026 మే నెలలో కనిపించే బ్లూ మూన్‌లో మరో వింత కూడా ఉంది. ఆరోజు కనిపించేది ‘మైక్రో మూన్’ (Micro Moon). అంటే చంద్రుడు భూమికి తన కక్ష్యలో అత్యంత దూరంగా ఉంటాడు. అందువల్ల ఈ బ్లూ మూన్ నాడు చంద్రుడు సాధారణం కన్నా కొంచెం చిన్నగా కనిపిస్తాడు. టెలిస్కోపులు అక్కర్లేకుండానే ప్రతి ఒక్కరూ ఈ బ్లూ మూన్‌ను వీక్షించవచ్చు.
ఈ బ్లూ మూన్ సమీపంలో “అంటారెస్” అనే ప్రకాశవంతమైన ఎర్ర నక్షత్రం కూడా కనిపిస్తుంది. అలాగే శుక్రుడు (Venus), గురుడు (Jupiter) గ్రహాలు కూడా ఆకాశంలో కనిపించి అద్భుత దృశ్యాన్ని సృష్టించనున్నాయి.
ఖగోళ శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అరుదుగా కనిపించే బ్లూ మూన్‌ల వలె కాకుండా, మైక్రోమూన్‌లు సంవత్సరంలో చాలాసార్లు సంభవించవచ్చు. ఎర్త్‌స్కై నివేదికల ప్రకారం.. రాబోయే జూన్ 2026 స్ట్రాబెర్రీ మూన్ కూడా ఒక మైక్రోమూన్‌గా పరిగణించబడవచ్చు, తద్వారా వరుసగా అనేక మైక్రోమూన్‌లు ఏర్పడే ఒక అరుదైన క్రమాన్ని సృష్టించవచ్చు.
