Telangana Rains : తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. అలర్ట్ జారీ..
Telangana Rains : కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తరువాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. ప్రతీయేటా సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న తాకిన తరువాత పది రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా. కానీ, ఈసారి ముందుగానే రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు.
- తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్
- రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్
- నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు.. హెచ్చరికలు జారీ
Telangana Rains : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రెండు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు రాబోతున్నాయని తెలిపింది. వచ్చే మూడురోజుల్లో వాతావరణం చల్లబడి వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. ప్రతీయేటా జూన్ 1నాటికి కేరళ రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి ఉత్తరదిశగా కదులుతూ విస్తరిస్తాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు క్రమంగా రుతుపవనాలు చేరుకుంటాయి. కేరళ రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి రుతుపవనాలు విస్తరించిన చోట వర్షాలు కురవడం మొదలవుతాయి. ఈ వర్షాల సీజన్ సెప్టెంబర్ వరకు ఉంటుంది.
కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తరువాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. ప్రతీయేటా సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న తాకిన తరువాత పది రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా. కానీ, ఈసారి ముందుగానే రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రుతుపవనాలు ప్రవేశించిన తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ద్రోణి కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా.. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
