మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. బాల్య వివాహంగా పరిగణిస్తారు. అంతేకాదు కేసులు నమోదు చేసి జైలుకి కూడా పంపిస్తారు. కానీ ఫస్ట్ టైమ్.. ఓ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అమ్మాయి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని భిన్నమైన తీర్పు ఇచ్చింది. 52 ఏళ్ల వ్యక్తి 14 ఏళ్ల అమ్మాయిని చేసుకున్న పెళ్లి కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారి వివాహం చెల్లుబాటు అవుతుందని కోర్టు చెప్పింది. ఆ వ్యక్తికి భార్యగా ఉండేందుకు అమ్మాయి అంగీకరిస్తే.. ఆ పెళ్లి చట్టబద్దమే అవుతుందని తెలిపింది.
కేసు వివరాల్లోకి వెళితే.. 52 ఏళ్ల వయసున్న వ్యక్తి 14 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2015లో ఈ ఘటన జరిగింది. 2017 ఫిబ్రవరి 13న.. అమ్మాయి.. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిపై అత్యాచారం, లైంగిక దాడి, బాల్య వివాహ చట్టం ఉల్లంఘన కింద కేసులు పెట్టారు. ఈ కేసుని విచారించిన కోర్టు.. ఆ వ్యక్తికి జైలు శిక్ష విధించింది. దీంతో అతడు 10 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వయసు 56ఏళ్లు. అమ్మాయి వయసు 18 ఏళ్లు. మైనర్ మేజర్ గా మారింది.
బాంబే హైకోర్టులో ఈ కేసు విచారణకి వచ్చింది. ఈ కేసులో అమ్మాయి మనసు మార్చుకుంది. 56 ఏళ్ల వ్యక్తికి భార్యగా ఉండేందుకు అంగీకరించింది. ఇదే విషయాన్ని తన లాయర్ ద్వారా కోర్టుకి తెలిపింది. అమ్మాయి మేజర్ కావడం, ఆ వ్యక్తికి భార్య ఉండటానికి ఇష్టపడటంతో.. వారిద్దరి వివాహం చెల్లు బాటు అవుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. 56 ఏళ్ల వ్యక్తికి, తనకు మధ్య ఉన్న వివాదాలను సెటిల్ చేసుకున్నామని, ఆ వ్యక్తికి భార్యగా ఉండేందుకు తాను ఇష్టపడుతున్నానని అమ్మాయి కోర్టుకి తెలిపింది.
జస్టిస్ రంజిత్ మోర్, భారతి దంగ్రేతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసుని విచారించింది. విచారణ సందర్భంగా జడ్జిలు కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఇంత జరిగాక ఆ అమ్మాయిని ఎవరూ భార్యగా అంగీకరించలేరు. సమాజంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆమె భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం అత్యంత ముఖ్యం. అమ్మాయి బాగోగులు, సంక్షేమం ప్రధానం. అందుకే ఆ అమ్మాయి విజ్ఞప్తిని అంగీకరిస్తున్నాం. ఆ వ్యక్తికి భార్యగా ఉండేందుకు ఇష్టపడింది. దీంతో ఈ పెళ్లి చట్టబద్దం అవుతుంది” అని చెప్పారు.