హ్యాట్సాఫ్ : కరోనాను జయించిన కేరళ నర్సు…తిరిగి విధుల్లో చేరేందుకు ఉత్సాహం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా. ఈమె చరిత్ర సాధారణమైనదేమీ కాదు. కొట్టాయం జిల్లాలోని హాస్పిటల్ లో ఇండియాలోనే అతి వృధ్ద జంటకు కరోనా సోకగా.. వారికి వైద్య చికిత్సలు చేస్తూ.. ఈ  రోగాన్ని తనకూ అంటించుకుంది రేష్మా. అహర్నిశలూ వారి బాగోగులు చూస్తుండడంతో రేష్మాకు కూడా కరోనా సోకింది. 

వృద్ధ పేషెంట్లు అయిన 93 ఏళ్ళ థామస్ అబ్రహాం, అతని భార్య 88 ఏళ్ళ మరియమ్మలను తన కన్నతలిదండ్రులకన్నా ఎక్కువగా చూసుకుంటూ, ICU లో వైద్య  సేవలోనే గడుపుతూ వచ్చింది రేష్మా. కంటికి రెప్పలా వారిని కాపాడింది. దీంతో ఆ వృధ్ద జంట పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా సోకిన రేష్మా అదే హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉండక తప్పలేదు. కానీ కేరళ హెల్త్ కేర్ పుణ్యమా అని ఈ వ్యాధి బారి నుంచి పూర్తిగా బయటపడింది. ‘కరోనానుంచి కోలుకున్నానని, దాన్ని జయించానని, వారం రోజుల్లోగా ఈ గది నుంచి వచ్చేస్తానని’ తన ఫ్రెండ్స్ కి,  తన సహచరులకు వాట్సాప్ మెసేజెస్ పంపింది ఈ నర్సు.

 ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే 14రోజుల సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. 14 రోజులపాటు ఇంటిలోనే స్వీయ నియంత్రణలో ఉండి.. మళ్ళీ ఈ ఆసుపత్రికి వచ్చి  ఐసొలేషన్ వార్డులో నర్సుగా తన విధులను నిర్వరిస్తానని, కరోనా రోగులకు సేవ చేస్తానని రేష్మా అంటోంది. ఈమె మనోధైర్యాన్ని కొనియాడని వాళ్ళు లేరు.. కాగా-థామస్ అబ్రహాం, అతని భార్య మరియమ్మకు ఇటలీ నుంచి తిరిగి వఛ్చిన వీరి కొడుకు, కోడలు, చిన్నారి మనవడి ద్వారా కరోనా సోకింది. అయితే అందరూ ఈ రోగం నుంచి కోలుకుని విముక్తులయ్యారు. కేరళ హెల్త్ కేర్ వ్యవస్థ పట్ల తనకు ఎంతో విశ్వాసం ఉందని, ఇది వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ అంటూ రేష్మ ప్రశంసలు గుప్పించింది.