Drones to Women led SHG: వ్యవసాయంలో సాంకేతిక విప్లవం.. మహిళా బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్న కేంద్రం

దీనితో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు పథకాన్ని పొడగించారు

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు రానుంది. వ్యవసాయ రంగాన్ని స్మార్ట్ గా మార్చడంలో భాగంగా, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రూపొందించిన పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2023-24 నుంచి 2025-26 మధ్యకాలంలో 15,000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా పథకాన్ని రూపొందించారు.

ఈ పథకం కోసం 1,261 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. పథకం కింద గరిష్టంగా 8 లక్షల రూపాయల మేర 80% ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించనుంది. లబ్దిదారులకు 5 రోజుల పాటు డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మరో 10 రోజుల పాటు డ్రోన్ల ద్వారా వ్యవసాయ సేవలపై శిక్షణ ఇస్తారు. 2023-24 రబీ సీజన్ కోసం ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సీడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం 22,303 కోట్ల రూపాయలు పడనుంది.

ఇక దీనితో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు పథకాన్ని పొడగించారు. అన్న యోజన పథకం కింద పేద కుటుంబాలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తారు. అత్యోందయ పథకం లబ్దిదారులకు 35 కేజీల ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తారు. పథకం కింద దేశంలో దాదాపు 81 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ఐదేళ్లలో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 11.80 లక్షల కోట్ల రూపాయల భారం పడనుంది.

ట్రెండింగ్ వార్తలు