ఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన అంశం రాఫెల్ డీల్. కేంద్రంలోని మోడీ సర్కార్ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చేసుకున్న రాఫెల్ డీల్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మోడీ సర్కార్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన అంశం రాఫెల్ డీల్. కేంద్రంలోని మోడీ సర్కార్ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చేసుకున్న రాఫెల్ డీల్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. యుద్ధ విమానాల కొనుగోళ్ల విషయంలో మోడీ సర్కార్ భారీ స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ సహా విపక్షాలు పెద్దఎత్తున ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో విపక్షాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాఫెల్ డీల్‌లో కేంద్రానికి కాగ్ క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు రాఫెల్ డీల్ అద్భుతం అంటూ మోడీ ప్రభుత్వానికి కితాబు కూడా ఇచ్చింది. 2007లో యూపీఏ ప్రభుత్వం కంటే ఇప్పటి మోడీ ప్రభుత్వం రాఫెల్ డీలే బాగుందని కాగ్ తేల్చి చెప్పింది. యూపీఏ హయాంలో చేసుకున్న డీల్‌తో పోలిస్తే ఇది 2.8 శాతం తక్కువని..17శాతానికి పైగా డబ్బు ఆదా అయ్యిందని కాగ్ స్పష్టం చేసింది. కాగ్ నివేదిక కాంగ్రెస్‌కు కన్నీళ్లు తెప్పిస్తే.. బీజేపీ మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది.
పార్లమెంట్‌లో రాఫెల్ డీల్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ… 2019, ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. బడ్జెట్ సమావేశాలు ముగిసే చివరి రోజు ఈ నివేదికను రాజ్యసభ ముందుకు తీసుకొచ్చింది. ఈ నివేదిక కొత్త డీల్‌ను సమర్థించింది. గతంలో 126 రాఫెల్ విమానాల ఒప్పందంతో పోలిస్తే.. ఎన్డీయే ప్రభుత్వం 36 ఫైటర్ జెట్స్ కోసమే ఒప్పందం చేసుకుంది. అయితే ఈ విమానాలకు చేయాల్సిన కొన్ని కీలక మెరుగులను భారత్‌లోనే చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల దేశానికి 17.08 శాతం మేర డబ్బు ఆదా అయిందని ఈ నివేదిక చెప్పింది.
గతంలో 126 ఫైటర్ జెట్స్ కోసం చేసిన ఒప్పందంతో పోలిస్తే కొత్త డీల్‌లో తొలి 18 యుద్ధ విమానాల డెలివరీ కూడా 5 నెలల ముందుగానే జరగనున్నదని కాగ్ తెలిపింది. యూపీఏ హయాంలోని ఒప్పందం కంటే 9 శాతం తక్కువకు తాము ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేస్తున్నామని గతంలో కేంద్రం తెలిపింది. అయితే అది 9శాతం కాదని 2.8 శాతమేనని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 114 పేజీలతో కాగ్ నివేదిక ఉండగా.. అందులో రాఫెల్ వ్యవహారంపై 32 పేజీలతో నివేదిక ఉంది. రాఫెల్ యుద్ధ విమానం ధర ఎంత అన్న దానిపై మాత్రం రిపోర్టులో వివరాలు లేవు. రాఫెల్ డీల్ అద్భుతం అంటూ కాగ్ ఇచ్చిన నివేదిక బీజేపీ నేతలకు బూస్టింగ్ ఇచ్చింది. కాంగ్రెస్‌పై వారు మాటల యుద్ధానికి దిగారు. అబద్దాలు చెప్పే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాత్రం రాఫెల్ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనిల్ అంబానీకి దళారీలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి రక్షణ ఒప్పందం గురించి ముందే అంబానీకి చెప్పేశారని ఆరోపించారు. ఇది దేశద్రోహమని, మోడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాఫెల్‌పై కాగ్ నివేదిక పనికిమాలిన నివేదిక అని, అది చౌకీదార్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ అని రాహుల్ విమర్శించారు. రాఫెల్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.