Campaigning Comes To An End For 6th Phase Of Bengal Assembly Polls
Bengal polls పశ్చిమ బెంగాల్లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రం 6:30గంటలకు ముగిసింది. ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం(ఏప్రిల్-22,2021)పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న వేళ ఎన్నికల ప్రచార ముగింపు గడువును 48గంటల నుంచి 72గంటలకు పొడిగించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఓటింగ్‌కు మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని ఆయా పార్టీలకు సూచించింది. చివరి మూడు దఫాల ఓటింగ్‌కూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది. అంతకుముందున్న నిబంధనల ప్రకారం.. పోలింగ్ తేదీకి 48 గంటల ముందువరకు ప్రచారం నిర్వహించేందుకు వీలుండేది.
ఆరో దశలో భాగంగా గురువారం ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 17 స్థానాలకు, నదియా జిల్లాలోని 9స్థానాలకు, ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లాలోని 9 స్థానాలకు, పూర్వ బర్ధామన్ జిల్లాలోని 8 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. 14,480 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6:30గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా.. 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేతలు జ్యోతిప్రియ మల్లిక్, చంద్రిమ భట్టాచార్య, సీపీఐ(ఎం) తరఫున తన్మయ్ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ తరఫున బరిలోకి దిగనున్న ఫిల్మ్ డైరక్టర్ రాజ్ చక్రవర్తి, నటి కౌషాని ముఖర్జీ కూడా ఆరో దశ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో.. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 114 సీట్లకు మూడు దశల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.