CBSE 12th Result 2026 : కొంపముంచిన నూతన విధానం.. గగ్గోలు పెడుతున్న సీబీఎస్ఈ విద్యార్థులు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై విమర్శల వెల్లువ

CBSE 12th Result 2026 : మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడంతోపాటు, పారదర్శకతను మెరుగుపర్చేందుకు ఈ ఏడాది 12వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనంకోసం సీబీఎస్ఈ ఆన్‌-స్క్రీన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ విధానం వల్ల తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

CBSE 12th Result 2026

CBSE 12th Result 2026 : సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను ఈనెల 13వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత 85.20శాతంగా నమోదైంది. అయితే, ఫలితాలపై విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు తాము ఊహించిన దానికంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ సీబీఎస్ఈ బోర్డు నూతనంగా తీసుకొచ్చిన డిజిటల్ మూల్యాంకన విధానమేనని పేర్కొంటున్నారు. డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ మార్కులను ప్రభావితం చేసిందనే వాదనను విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు పలువురు అధ్యాపకులుసైతం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Gold silver Price Today : మోదీ దెబ్బకు బంగారం, వెండి ధరలు ఢమాల్.. ఒక్కసారిగా పడిపోయిన రేట్లు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడంతోపాటు, పారదర్శకతను మెరుగుపర్చేందుకు ఈ ఏడాది 12వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనంకోసం సీబీఎస్ఈ ఆన్‌-స్క్రీన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా పరీక్ష పత్రాలను స్కాన్ చేసి, ఎగ్జామినర్లు కంప్యూటర్ స్క్రీన్ లపై సమాధానాలను పరిశీలించి మార్కులను కేటాయిస్తారు. ఈ విధానం వల్ల పారదర్శకత, ఖచ్చితత్వంతోపాటు మూల్యంకన ప్రక్రియలో వేగం పెరుగుతుందని బోర్డు తెలిపింది. అయితే, పలితాలు వెలువడిన తరువాత ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డిజిటల్ మూల్యాంకనం ద్వారా ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు పలువురు అధ్యాపకులు సోషల్ మీడియా ద్వారా గగ్గోలు పెడుతున్నారు. హడావుడిగా చేసే ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కారణంగా సీబీఎస్ఈ ఉత్తీర్ణత శాతం తగ్గిందని, ఇది లక్షలాది మంది విద్యార్థులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఓ భౌతిక శాస్త్ర అధ్యాపకుడు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఒక డిజిటల్ వ్యవస్థ నిష్పక్షపాతాన్ని మెరుగుపర్చాలి కానీ, సమాధానాలను చాలా వేగంగా తనిఖీ చేయడం వల్లనో లేదంటే ముఖ్యమైన దశలను విస్మరించడం వల్లనో అర్హులైన వారి మార్కులను తగ్గించకూడదాని పేర్కొన్నారు.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఓ విద్యార్థి మాట్లాడుతూ.. తనకు జేఈఈ మెయిన్ 2026లో దాదాపు 90శాతం రాగా.. సీబీఎస్ఈ 12వ తేగతి బోర్డు పరీక్షలో కేవలం 71.8శాతం మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, నేను 85 నుంచి 88శాతం మార్కులు వస్తాయని ఆశించానని, కానీ, ఈ డిజిటల్ మూల్యాంకనం ద్వారానే నాకు మార్కులు తగ్గాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలువురు అధ్యాపకులు సీబీఎస్ఈ నూతనంగా తీసుకొచ్చిన డిజిటల్ మూల్యాంకనం తీరుపై విమర్శలు చేస్తున్నారు.

ఈ విషయంపై విద్యావేత్తలు మాట్లాడుతూ.. కొత్త విధానం కావడంతో ప్రారంభంలో గందరగోళం సహజమేనని, అయితే, మూల్యాంకనంలో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే అంశంపై సీబీఎస్ఈ సమగ్ర సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న విమర్శలపై సీబీఎస్ఈ బోర్డు అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం ద్వారా మూల్యాంకనంలో పారదర్శకత పెరిగిందని, భవిష్యత్తులో మరింత మెరుగుదలను తీసుకొస్తామని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.