Sugar Exports Ban: కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర ఎగుమతులు బంద్.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట
Govt Bans Sugar Exports : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది.
- Harish Thanniru
- Updated on- May 14, 2026 / 05:51 PM IST
Central Government Bans Sugar Exports
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- చెక్కర ఎగుమతులపై నిషేధం
- పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఊరట
Bans Sugar Exports : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారతదేశంలో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా పలు ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గ్యాస్ సరఫరా నిలిచిపోవటంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ లపై ఆంక్షలు విధించారు. దీంతో సిలిండర్ల కోసం గ్యాస్ గోడౌన్ల వద్ద పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరోవైపు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల పెరుగుదల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాల జారీ అయ్యే వరకు పంచదార ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ముడి, తెల్ల, శుద్ది చేసిన పంచదారలకు ఈ నిషేధం వర్తిస్తుంది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉత్తర్వులకు ముందే లోడింగ్ ప్రారంభమైనా, పంచదార నిల్వలను కస్టమ్స్ కు అప్పగించినా వాటి ఎగుమతులకు అనుమతిస్తామని కేంద్రం పేర్కొంది. మరోవైపు ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం ఐరోపా, అమెరికాకు ఈ ఎగుమతుల నిషేధం వర్తించని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రధాన చెరకు సాగు ప్రాంతాల్లో దిగుబడులు బలహీనపడటం వల్ల వరుసగా రెండవ సంవత్సరం కూడా ఉత్పత్తి వినియోగం కంటే తగ్గిందని అంచనా. ఎల్‌నినో పరిస్థితుల రాబోయే రుతుపవనాలపై ప్రభావంచూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా చెరకు దిగుబడులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశంలో చెక్కర ధరలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.
Also Read : బిగ్ అలర్ట్.. ఈనెల 20న మెడికల్ షాపులు బంద్.. కారణాలివే..
బ్రెజిల్ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద చెక్కర ఎగుమతిదారుల్లో భారతదేశం ఒకటి. గతంలో 159 మిలియన్ మెట్రిక్ టన్నుల పంచదారను ఎగుమతి చేయడానికి మిల్లులకు అనుమతి ఇచ్చింది. వ్యాపారులు ఇప్పటికే సుమారు ఎనిమిది లక్షల టన్నులకు ఒప్పందాలు కుదుర్చుకోగా.. అందులో ఆరు లక్షల టన్నులకుపైగా రవాణా చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ఫిబ్రవరిలో అదనపు ఎగుమతి కోటాలను అందించడంతో వ్యాపారులు ఎగమతి ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ప్రోత్సాహం లభించినట్లయింది. అయితే, కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు ఆ ఆర్డర్లను ఎగుమతి చేయడం వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కొందరు వ్యాపారులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నా.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఊరట లభించినట్లవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
